బస్సులన్నీ కుప్పం సీఎం పర్యటనకు తరలింపు
అసలే వారాంతపు రోజు
పైగా పెళ్ళిళ్లు ఎక్కువ
బస్సుల్లేక జనం అవస్థలు
పలమనేరు: ‘‘ఏం చంద్రబాబోనమ్మా ఆయప్ప మిసికిమంటే కుప్పానికి ఏమికిటి వస్తాడో గానీ ఆయప్ప వచ్చినప్పుడంతా బస్సుల్లేక ఇదేం ఖర్మ. పిల్ల పాపలు, ముసలి ముతలకు బస్సుల్లేకుండా రోడ్లపై పడిగాపులు పడుతుంటే ఆ బాధ పడేవాళ్ళకు తెలుస్తుంది’’ అంటూ రోడ్లపై బస్సుల కోసం పాట్లు పడుతున్న మహిళ శాపనార్థాలు. పలమనేరు డిపోలో గతంలో 80 దాకా బస్సులు ఉండేవి. వీటిల్లో కొన్నింటిని పుంగనూరు డిపోకు, మరికొన్నింటిని కుప్పానికి పంపేశారు. ప్రస్తుతం ఇక్కడ కాలం చెల్లిన ఆర్డినరీ బస్సులు తప్ప ఇంకేమీ లేవు. కుప్పానికి సీఎం చంద్రబాబు వచ్చినప్పుడల్లా ఇక్కడి డిపోలోని బస్సులను జనాన్ని తరలించేందుకు కుప్పానికి పంపుతుంటారు. ఇదే మాదిరి ఇప్పుడు పంపారు. అయితే శనివారం వారాంతం కావడంతో అసలే రద్దీ ఎక్కువా ఉంటుంది. దానికితోడు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో బస్సులు లేకుంటే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆటోలు, పాల టెంపోలకు పండగ
చంద్రబాబు ఎప్పుడు కుప్పానికి వస్తారా అని కాపుగాచుకుని ఉండే ప్రైవేటు వాహనాల వారు దొరికిందే దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు. బస్సులు లేని సమయంలో రెట్టింపు ధరలు షరా మామూలే. ఇక పాల టెంపోల వారికీ కొమ్ములొస్తాయి. వారు చెప్పినంత ఇవ్వాల్సిందే. పలమనేరు నుంచి బైరెడ్డిపల్లికి బస్సులో టికెట్ చార్జి రూ.40 అయితే బస్సులేనప్పుడు రూ.500 ఇవ్వాల్సిందే. ఇదే పరిస్థితి అన్ని మార్గాల్లో ఉంటుంది. ఏదేమైనా సీఎం కుప్పానికి వచ్చిన ప్రతిసారీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు పడే కష్టాలు ఆ భగవంతునికే తెలియాలి.
ఓటరూ.. మేలుకో!
ఓటరు మహాశయా మేలుకో! నీ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిచేసి ఇవ్వడానికి కేవలం 10 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.


