జిల్లాలోని మామిడి రైతుల పొట్టగొడుతూ పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న తక్కువ ధర కాయలతో పళ్లగుజ్జు ఫ్యాక్టరీల యజమానులు కాసుల వేట సాగిస్తున్నారు. స్థానిక రైతన్న ఆవేదనను గాలికొదిలేసి, తమిళనాడు నుంచి తక్కువ ధరకు లభిస్తున్న మామిడి కాయలను ఇక్కడి ఫ్యాక్టరీలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ స్థానిక మార్కెట్‌ను కుప్పకూలుస్తున్నారు. గుడిపాల మండలంలోని పలు పల్ప్ ఫ్యాక్టరీలే ఇందుకు ప్రధాన కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమిళనాడుకు చెందిన కొందరు మధ్యవర్తులు, వ్యాపారులు అక్కడి తోటల్లో తోతాపురి కాయలను కేవలం రూ.3 నుంచి రూ.4లకే కొనుగోలు చేస్తున్నారు. వాటిని లారీల ద్వారా సరిహద్దులు దాటించి చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలకు రూ.4 నుంచి రూ.5లకు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఇటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా స్థానిక రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందనే నెపంతో, తమిళనాడు కాయల వైపే మొగ్గు చూపుతున్నాయి.
మన రైతుకు ఆంక్షలు..
పొరుగు లారీలకు పర్మిషన్లు
స్థానిక రైతుల పట్ల ఫ్యాక్టరీల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లా రైతులు తమ కాయలను కేవలం ట్రాక్టర్లలో తీసుకొస్తేనే కొంటామని, లారీల్లో తీసుకురావద్దంటూ వింత నిబంధనలు విధిస్తున్నారు. కా యల లోడింగ్ ఎక్కువైతే రేటు పడిపోతుందనే సాకు చూపుతున్నారు. కానీ, తమిళనాడు నుంచి మాత్రం యథేచ్ఛగా లారీల కొద్దీ వస్తున్న మామిడి లోడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫ్యాక్టరీల లోపలికి అనుమతిస్తుండడం గమనార్హం. దీనివల్ల స్థానిక జిల్లా కాయలను ఫ్యాక్టరీలు పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి.
లెక్కల్లో మాయాజాలం!
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు కాగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో కేవలం తోతాపురి రకమే సాగైంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల లెక్కల్లో తమిళనాడు నుంచి వచ్చిన కాయలను కూడా కలిపేశారు. పొరుగు రాష్ట్రం నుంచి ఎంత మేర కొనుగోలు చేశారనే వివరాలను ఫ్యాక్టరీల యాజమాన్యాలు అధికారిక లెక్కల్లో ఎక్కడా చూపించడం లేదు. రైతు సంఘాల నాయకుల అంచనా ప్రకారం.. ఈ సీజన్‌లో ఇప్పటికే సుమారు 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల తమిళనాడు కాయలు జిల్లాలోని ఫ్యాక్టరీలకు చేరిపోయాయి. దీనివల్ల స్థానిక రైతుల కాయలు తోటల్లోనే మగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు స్పందించి స్థానిక రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


