భగ్గుమన్న పాత.. కొత్త నాయల మధ్య విభేదాలు
చెరువు మట్టి తవ్వకంలో ఇరు వర్గాల వివాదం
తిరుమణ్యం చెరువును తవ్వేస్తున్న వైనం
పట్టించుకోని అధికారగణం
సాక్షి టాస్క్‌ఫోర్స్: మండల కేంద్రమైన వడమాలపేటలో తెలుగుదేశం పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులు నాయుడు టిప్పర్లను శనివారం అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి వర్గం ఆపడంతో వడమాలపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మండల పరిధిలోని తిరుమణ్యం చెరువు నుంచి గత రెండు రోజులుగా వందలాది టిప్పర్ల మట్టిని పాదిరేడు గ్రామంలోని ప్రైవేటు పనులకు తోలుతున్నారు. ఈపనికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడు నాయకత్వం వహిస్తుండగా, దీనిని వైఎస్సార్‌సీపీ నుంచి వలస వెళ్లిన వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. శనివారం పోలీసుల సాయంతో టిప్పర్లను ఆపించారు. దీనిపై ఆగ్రహించిన ధనంజయులునాయుడు వర్గం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నట్లు వీరి వాదన. చెరువును నాశనం చేస్తున్నారన్నది మరొకరి వాదన. దీనిపై ఎటూ తేల్చుకోలేని పోలీసులు టిప్పర్లను స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిలబెట్టారు. ఇంత జరుగుతు న్నా స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
పార్టీలో చేరిన రోజు నుంచే..
మాజీ మంత్రి ఆర్కే రోజా చలవతో వడమాలపేట జెడ్పీటీసీగా గెలుపొందిన మురళీధర్‌రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. నాటి నుంచి స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడుపై పైచేయి సాధించాలని మురళీధర్‌రెడ్డి తనదైన శైలిలో ఎమ్మెల్యే భానుప్రకాష్ వద్ద రాజకీయం నెరుపుతూ వచ్చారు. దీనిపై ధనంజయులునాయుడు ఎమ్మెల్యే వద్ద ఎప్పటికప్పుడు తన అభ్యంతరాలను తెలుపుతూ వచ్చారు. అయినా పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్న చందాన ఎమ్మెల్యే మురళీధర్‌రెడ్డీకే తన మద్దతు ఇస్తున్నారన్నని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ భావనకు తాజాగా జరిగిన సంఘటన బలాన్ని చేకూరుస్తోంది. ధనంజయులునాయుడు టిప్పర్లను ఆపించగలిగే స్థాయికి మురళీధర్‌రెడ్డి పార్టీలో పెరిగిపోయాడన్న చర్చ మండలంలో చక్కర్లు కొడుతోంది.


