ఏడాదిలో ఎప్పుడో ఓసారి టమాటా బాక్సు రూ.1000 ఫలికి కోటీశ్వురులైనన రైతులు పదో పరకో ఉంటారు. వారిలాగే మనం కూడా టమాటాలో లక్షలు గడించాలని అప్పులు చేసి మరీ టమాటాను సాగుచేసి చేతులు కాల్చుకుంటున్న రైతులు వేలాది మంది ఉన్నారు. ఇక్కడ టమాటా సేద్యం జూదంగా మారింది.
పలమనేరు: ఈసారి టమాటా రైతుకు సైతం మామిడి రైతు పరిస్థితే ఎదురైంది. మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. కాయలమ్మితే కనీసం కూలీలు కూడా రావడం లేదు. పలమనేరు మార్కె ట్‌లో శుక్రవారం బాక్సు ధర గరిష్టంగా రూ.150, కనిష్టంగా రూ.70, సగటు ధర రూ.90గా పలికింది. ఈ ధరల్లో టమాటా కోసినా కనీసం కూలీలకు, రవాణా ఖర్చులకు డబ్బులు రావని రైతులు కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేశారు. తోటల్లో ఎర్రటి సీరియల్ బుల్బుల్లా కనిపిస్తున్న టమాటాలను చూసిన జనం అయ్యో టమాటా రైతులకు ఎంత కష్టమొచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరానికి లక్ష నష్టం
ఎకరా పొలంలో టమాటా సాగు చేసేందుకు సుమారుగా రూ.2లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఎకరానికి వెయ్యి బాక్సుల దిగుబడి వస్తే ఇప్పుడున్న ధర రూ.100తో రూ.లక్ష వస్తుంది. దీంతో రైతుకు లక్ష నష్టంతోపాటు కుటుంబమంతా కష్టపడిన కూలి కూడా రానట్టే. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండువేల హెక్టార్లలో టమాటా సాగులో ఉంది.
రైతు ఉత్పత్తులుకు ఎమ్మార్పీ ఉండదా?
మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువుకు కంపెనీ నిర్ణయించే ఎమ్మార్పీ ధర ఉంటుంది. చివరకు గుండుసూదికి సైతఽం ధర ఉంటుంది. కానీ రైతుల పండించే ఉత్పత్తులకు మాత్రం ధర ఉండదు. రైతు చేసే వ్యవసాయం ద్వారా పరోక్షంగా పదిమంది బాగుపడుతున్నారు. కానీ రైతు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నాడు.
కోతకూలి కూడా దక్కదు
టమాటా కాయలు కోసేందుకు వచ్చే కూలీలకు రూ.500 కూలి, వారి గ్రామం నుంచి తోట వద్దకు ఆటోలో తీసుకురావాలి. వారికి భోజనం పెట్టి తాంబూళం కూడా రైతులివ్వాల్సిందే. ఎకరా తోటలో పదిమంది కూలీలు కాయలు కోస్తే 50 బాక్సులు అవుతాయి. ఇప్పుడున్న బాక్సు ధర రూ.వందతో రూ.5వేలు దక్కుతుంది. ఇందులో మండీ నిర్వాహకులు పదిశాతం కమీషన్‌తో రూ.500 పట్టుకుని రూ.4,500 చేతికిస్తాడు. పదిమంది కూలీలకు రూ.500తో రూ.5వేలు, భోజనానికి రూ.500, మా ర్కెట్‌కు తీసుకొచ్చే లగేజి ఆటోకు రూ.500 మొత్తం కలిపి కోత ఖర్చు మాత్రమే రూ.6వేలు. రైతుకు అందిన బిల్లు రూ.4,500 దీంతో రూ.1500 నష్టం. దీని కి తోడు రైతు కష్టం పోయినట్టే. దీంతో తోటల్లోని కాయలను కోయకుండా రైతులు వదిలేస్తున్నారు.


