తోతాపురి కొనుగోలుకు ఫ్యాక్టరీల బ్రేకులు
రిపేర్ల సాకుతో వారం రోజులుగా
నిలిపివేత
ఫ్యాక్టరీల ముందే కుళ్లిపోతున్న
మామిడి కాయలు
ఒక్కో ట్రాక్టర్‌లో 2 టన్నుల వరకు వృథా
పక్క రాష్ట్రం కాయలపై మోజు..
స్థానిక రైతుపై వివక్ష
టీడీపీ నేతల సిఫార్సులకే పెద్దపీట.. సామాన్య రైతు రోడ్డుపైనే
మామిడి రైతులకు కష్టాలొచ్చాయి. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామంటే ఫ్యాక్టరీల యజమానులు దగా చేస్తున్నారు. సాకులు చెప్తూ కొనుగోళ్లకు బ్రేకులు వేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పల్ప్ ఫ్యాక్టరీల యజమానులు ఆడుతున్న నాటకాలకు సామాన్య రైతు నిలువునా మునుగుతున్నాడు. యంత్రాలు ‘రిపేర్’ అంటూ తోతాపురి కాయల కొనుగోళ్లను అర్ధంతరంగా నిలిపివేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. మరోవైపు ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాణిపాకం: తోతాపురి మామిడి రైతు కోలుకునే పరిస్థితి కనబడడం లేదు. కాయలను గుజ్జు ఫ్యాక్టరీలు కొంటాయనే ఆశతో వారం రోజులుగా వందలాది ట్రాక్టర్లతో రైతులు ఫ్యాక్టరీల ముందే పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు ఎండలో రోజుల తరబడీ ట్రాక్టర్‌లోనే ఉండడంతో కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌లో 4 నుంచి 5 టన్నుల లోడ్ ఉంటే.. తీరా అన్‌లోడింగ్ చేసే సమయానికి దాదాపు 2 టన్నుల కాయలు కుళ్లిపోయి వృథాగా మారుతున్నాయి. కళ్ల ముందే పంట కుళ్లిపోతుంటే ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే తీరా నీలం కొంటామని ఫ్యాక్టరీలు బోర్డు పెట్టడంతో రైతులు మండిపడుతున్నారు.
టార్గెట్ పూర్తి కాకుండానే చేతులెత్తేశారు
జిల్లా వ్యాప్తంగా 59 వేల హెక్టార్లలో మామిడి సాగవగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో తోతాపురి రకమే ఉంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఇంకా లక్ష్యానికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మిగిలి ఉండగానే.. అప్పుడే గంగాధర నెల్లూరులోని ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసి చేతులెత్తేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాలకుల సిఫార్సులు..
అధికారుల ఉత్తుత్తి తనిఖీలు
సామాన్య రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఉద్యానశాఖ అధికారులు మాత్రం ఉత్తుత్తి తనిఖీలతో కాలక్షేపం చేస్తూ రైతుల బాధలను గాలికొదిలేశారు. దీనికి తోడు ఫ్యాక్టరీల్లో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులున్న పెద్దల కాయలను మాత్రమే ఫ్యాక్టరీల యాజమాన్యాలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేశాయని, వెనుక ఎవరూ లేని సామాన్య చిన్న, సన్నకారు రైతుల కాయలను మాత్రం రోడ్డు పాలు చేశారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలను నట్టేట ముంచుతున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, తోతాపురి కొనుగోళ్లను పునఃప్రారంభించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.


