మామిడి అలా... టమాట ఇలా! | - | Sakshi
Sakshi News home page

మామిడి అలా... టమాట ఇలా!

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

నష్టపోతున్న 80 వేల మంది రైతులు

ఇక్కడికీ కర్ణాటకకు ధరల్లో భారీ తేడా

ప్రకటనకే పరిమితమైన హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు

జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మామిడి కాయలకు సరైన ధర అందలేదు. రైతులు కాయలను చెట్లలోనే వదిలేశారు. అలాగే టమాట పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎప్పుడు ధర ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని అయోమయ స్థితి. ఈ రెండు పంటలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది మంది రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకకు, ఇక్కడికీ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటుచేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది.

పలమనేరు: జిల్లాలో 58 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో 40 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగులో ఉంది. రైతులు 40 వేల మంది వరకు ఉన్నారు. గతేడాది ధరల్లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పల్ప్‌ ఫ్యాక్టరీల వద్ద మామిడి బండ్లు అన్‌లోడింగ్‌ కావడంలేదు. ర్యాంపుల వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వం ధర పెంచకుండా ప్రోత్సాహకం ఇస్తున్నామంటూ చేతులుదులుపుకుంది. దీంతో ఎక్కువ మంది రైతులు కాయలను తోటల్లోనే వదిలేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి కిలో రూ.17 ఉంటే గాని రైతులకు గిట్టుబాటు కాదు. కాయలను కోసి ఫ్యాక్టరీలకు వద్దకు తీసుకువచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. సకాలంలో అన్‌లోడింగ్‌ కాకపోవడంతో సకానికి పైగా కాయలు కుళ్లిపోతున్నాయి. ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చు, పెట్టుబడి ఏదీ వచ్చే పరిస్థితి లేదని రైతులు కుమిలిపోతున్నారు.

కర్ణాటకలో ధరలు బాగున్నాయి

కర్ణాటకలో తోతాపురి మామిడి ధర కిలో రూ.17.50 ఉంది. ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన ధర కిలో రూ.7.50లు. కిలోకు రూ.10 వ్యత్యాసం. ఇక్కడ టమాటా బాక్సు రూ.200 ఉండగా పక్కనే ఉన్న కోలారు టమాట మార్కెట్‌లో బాక్సు రూ.400 పలుకుతోంది. ఇక్కడికి.. అక్కడికి రూ.200 వ్యత్యాసం. ఇలా పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో ధరల్లో ఇంత భారీ తేడా ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

హార్టికల్చర్‌ హబ్‌ ఏమైందో..

గత ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామని, వ్యవసాయాన్ని పండగలా మార్చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఇజ్రాయేల్‌కంటే మిన్నగా హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా వాటి ఊసేలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ధరల్లేక పడేసిన మామిడి కాయలు

పలమనేరు సమీపంలోని హైవేలో పడేసిన టమాటాలు(ఫైల్‌)

భారీగా ధరలు పతనం

లాటరీగా మారిన టమాట

జిల్లాలోని పడమటి ప్రాంతాలైన పలమనేరు, కుప్పంలో టమాట సాధారణ సాగు 20 వేల హెక్టార్లలో ఉంది. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది రైతులు సీజన్‌తో సంబంధం లేకుండా టమాటాను సాగు చేస్తుంటారు. ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఎకరా పొలంలో టమాట సాగుకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఆ లెక్కన బాక్సు ధర రూ.400 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. రెండు నెలల్లో పది రోజుల పాటు బాక్సు ధర రూ.500 వరకు పలికింది. మళ్లీ ధరలు పడిపోయి రూ.150 నుంచి రూ.200 లకు చేరింది. ధరలు ఎప్పుడు ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పుడున్న ధరలతో రైతు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రానట్టే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement