పంట లేకున్నా బిల్లులు
ఆధార్, పట్టా, బ్యాంకు పాస్‌బుక్ ఉంటే చాలంటూ ప్రలోభాలు
గతేడాది బోగస్ బిల్లులతో రూ.కోట్లలో గోల్‌మాల్
ఈసారి పలు ఫ్యాక్టరీలు, ర్యాంపుల్లో
అక్రమాలకు రంగం సిద్ధం
ఉత్తర్వులు రాకముందే మొదలైన ముఠాల కసరత్తు
తోతాపురి రకం మామిడి కిలోకు ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రోత్సాహక నిధిని స్వాహా చేయడానికి ముఠాలు కన్నేశాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకముందే జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద బోగస్ బిల్లుల కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు ర్యాంపుల నిర్వాహకులు కాయలు విక్రయించకుండానే బిల్లులు సిద్ధం చేస్తామని, ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు పాస్‌బుక్ ఉంటే చాలని రైతులను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సారి కూడా ప్రోత్సాహక నిధిలో భారీ గోల్‌మాల్ జరిగే అవకాశాలపై ఉద్యానశాఖలో ఆందోళన నెలకొంది.
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో గత ఏడాది 25 మామి డి కొనుగోలు ర్యాంపులు ఉండగా ఈ సారి 42 పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్నింటి కార్యకలాపాల పైనే అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి కాయలు కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించే అవకాశం ఎక్కువగా ర్యాంపుల ద్వారానే ఉంటుందని భావిస్తున్నారు. ఫ్యాక్టరీల కంటే ర్యాంపుల్లో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు అవకాశంగా మారుతోంది.
ఈసారి అధికారులకు ముందే సమాచారం
ఈ ఏడాది అక్రమాలకు సంబంధించిన సంకేతాలు ముందుగానే ఉద్యానశాఖ అధికారులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ర్యాంపులు, ఫ్యాక్టరీలు రైతుల నుంచి ముందుగానే పత్రాలు సేకరిస్తున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతమున్న ర్యాంపులు, ఫ్యాక్టరీలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఉద్యానశాఖ వద్ద తగిన సిబ్బంది లేరు. ఉన్న వారితోనే అన్ని కేంద్రాలను పరిశీలించడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అక్రమాలను ఎలా అరికట్టాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కట్టుదిట్టమైన
చర్యలే పరిష్కారం
గతేడాది వెలుగులోకి వచ్చిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, రైతుల భూముల ధృవీకరణ, జియో ట్యాగింగ్, డిజిటల్ తూకం నమోదు, ఒకే రైతు పేరుతో బహుళ బిల్లులను నిరోధించే సాఫ్ట్‌వేర్ వ్యవస్థ తీసుకువస్తేనే అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు, రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు.
మామిడి ప్రోత్సాహక నిధిపై మళ్లీ ముఠాల కన్ను


