కాణిపాకం: కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన కుదరడం లేదు. తోతాపురి మామిడి కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తామని కోతలు కోసిన పెద్దలు అందులో సగం భారాన్ని కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా, రైతులకు చేకూరుస్తున్న అదనపు ప్రయోజనం ఏమీ లేదనే పచ్చి నిజం బయటపడింది.
8.65 లక్షల టన్నుల దిగుబడి
ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో 8.65 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో స్పందించిన కేంద్రం 25 శాతం లోపు అంటే 2.16 లక్షల టన్నులకే సబ్సిడీ ఇస్తామని మెలిక పెట్టింది. మిగిలిన 6 లక్షల టన్నులకు పైగా ఉన్న పంట పరిస్థితి ఏమిటని అన్నదాతలు మండిపడుతున్నారు.
గత ప్రభుత్వం అండగా నిలిచింది
గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆనాడు మొత్తం రూ.176 కోట్ల సబ్సిడీ అందితే, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 94.16 కోట్లు భరించి రైతులను ఆదుకుంది. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రం కిలోకు ఇచ్చే రూ.2.18ల లబ్ధిని కూడా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
చేతులెత్తేసిన కూటమి సర్కార్
రాయలసీమ వ్యాప్తంగా మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి చొరవ తీసుకుని కేంద్రానికి లేఖలు రాశారు. ఇక్కడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. దీంతో కేంద్రం స్పందించింది. మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద కిలోకు రూ.17.47 మద్దతు ధర ప్రకటించింది. అందులో 25 శాతం రూ.4.36 సబ్సిడీగా ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఇందులో సగం వాటా రూ.2.18లను భరిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.4 సబ్సిడీ ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కేంద్రం ఇస్తున్న వాటాను దాచి పెట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కంటే ఈ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నదేమీ లేదని అధికారులు స్పష్టం చేస్తుండడం గమనార్హం.


