జెడ్పీలో ఖాళీల భర్తీకి సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో ఖాళీల భర్తీకి సన్నాహాలు

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

● సిద్ధమైన ఫైల్స్‌ ● కొత్త జిల్లాలకు ఉద్యోగులు

చిత్తూరు కార్పొరేషన్‌: రాష్ట్రంలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమల్లోకి వచ్చాయి. జిల్లాలో ఉద్యోగుల స్థానికతను నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌కు శాఖకు చెంది జిల్లా పరిషత్‌ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఫ్రీజింగ్‌ను ప్రభుత్వం సడలించింది. దీంతో జిల్లాలోని సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లకు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాలు రూపొందిస్తున్నారు. జూన్‌ 30వ తేదీన పలువురు ఉద్యోగ విరమణ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

కొత్త జిల్లాలకు ఉద్యోగులు

జెడ్పీ పరిధిలోని 65 మంది మండల పరిషత్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిని కొత్త జిల్లాలైన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఏర్పాటు కానున్న జెడ్పీ కార్యాలయాలకు కేటాయించనున్నారు. జెడ్పీ, మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబరులో ముగియనుంది. అనంతరం కొత్తగా తిరుపతి, అన్నమయ్య జెడ్పీలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. చిత్తూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందోనని కంగారుపడుతున్నారు.

ఉద్యోగ విరమణతో ఖాళీలు

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల పరిపాలన అధికారులు (ఏవోలు) 15 మంది జూన్‌ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు. అలాగే సీనియర్‌ అసిస్టెంట్లు 12 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 10 మంది ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ స్థానాల్లో ఆఫీసు సబార్డినేట్లు, జూనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించనున్నారు. ఈ మేరకు జాబితాలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో జూలై 5 తర్వాత ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై నిషేధం అమల్లోకి వస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement