గతేడాది జిల్లాలోని 31 ఫ్యాక్టరీలకు 49,350 మంది రైతులు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు సరఫరా చేసినట్లు అధికారిక లెక్కలు నమోదయ్యాయి. అలాగే 25 ర్యాంపుల ద్వారా 30,600 మంది రైతులు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు విక్రయించినట్లు బిల్లులు సమర్పించారు. అనంతరం జరిగిన పరిశీలనలో సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల కాయల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే రైతు పేరుతో రెండు వేర్వేరు ర్యాంపుల్లో బిల్లులు సమర్పించడం, మామిడి తోటలే లేని వారి పేర్లతో కొనుగోళ్లు చూపించడం, నీలం రకం మామిడిని తోతాపురి రకంగా చూపించి ప్రోత్సాహక నిధి పొందడం, కాయలు తరలించకుండానే కొనుగోలు జరిగినట్లు రికార్డులు సృష్టించడం వంటి అక్రమాలు బయటపడినట్లు సమాచారం. కొందరు మధ్యవర్తులు రైతుల వివరాలను సేకరించి వారి పేర్లతోనే బిల్లులు రూపొందించినట్లు ఆరోపణలు వినిపించాయి.


