పుత్తూరు: అప్పలాయగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు పట్టుపీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలతో ముగ్దమనోహర రూపంలో స్వామి, అమ్మవార్లు రథారోహణం చేశారు. అనంతరం 9.25 నుంచి మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, అశేష భక్తజన గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధుల్లో రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కిలిపి విశ్వరూప దర్శనం, తోమాలసేవ, కొలువు, అర్చన, మొదటి గంట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. 8 గంటలకు పుణ్యాహవచనము, నవగ్రహపూజ నిర్వహించారు. 11.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 వరకు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు భక్తి కీర్తనల ఆలాపనల మధ్య స్వామివారి ఊంజల్ సేవ కనుల పండుగగా సాగింది. అనంతరం శ్రీవారు వాహన మండపంలోకి వేంచేపు చేశారు.
అశ్వంపై నుంచి అభయమిచ్చిన ప్రసన్నుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారు అశ్వవాహనంపై పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో విహరిస్తుండగా అశేష భక్తజనం గోవిందనామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, యువతుల ఆనందడోలికల కోలాటం నడుమ స్వామివారు అశేష భక్తజనానికి అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు నారికేళ, కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని కనులారా దర్శించుకొన్నారు. వాహన సేవ అనంతరం స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన వివిధ భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవలను కంకణ భట్టర్ సూర్యకుమారాచార్యుల బృందం నిర్వహించగా, కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు:
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం. 1.30 నుంచి 10.45 గంటల వరకు తీర్థవారి చక్రస్నానం. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు నిర్వహించే ధ్వజావరోహణంతో ప్రసన్న వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతాయి.
‘‘మానవుని శరీరమే రథం, ఆత్మ రథికుడు, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. శ్రీవారు అధిరోహించిన రథోత్సవాన్ని తిలకించే వారికి కలిగే తత్వజ్ఞానమిదే.’’


