యాంటీ డెంగీ మాసోత్సవం ప్రారంభించినా చర్యలు శూన్యం పారిశుద్ధ్య లోపం, మురుగు నీటి నిల్వతో పెరుగుతున్న దోమలు కనిపించని ఫాగింగ్ ఫొటోలకే ఫ్రైడే–డ్రైడే పరిమితం విషజ్వరాల ముప్పుపై వైద్య నిపుణుల హెచ్చరిక
డెంగీ వివరాలు
సంవత్సరం డెంగ్యూ 2022 179 2023 235 2024 307 2025 2026(జూన్ 26 వరకు) 116
వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ల మధ్యలో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా యాంటీ డెంగీ నివారణ మాసోత్సవం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో నివారణ చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినా గ్రామాలు, పట్టణాల్లో చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోయిన మురుగు, నీటి తొలగింపు చేపట్టకపోవడం, ఫాగింగ్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్‌గునియా జ్వరాలు ప్రబలుతాయన్న భయం వెంటాడుతోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలు, గుంతలు, ఖాళీ స్థలాలు, ఇంటి పరిసరాల్లోని పాత్రల్లో నీరు నిల్వ ఉంటోంది. ఇవి డెంగీ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, పట్టణాల్లో మురుగు నీరు నిల్వ ఉండడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. జిల్లాలో అనేక గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సకాలంలో చెత్తను తొలగించకపోవడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తున్నా స్థానిక సంస్థల అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణలో కీలకమైన ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయానికే పరిమితమైన మలేరియా శాఖ
డెంగీ, మలేరియా నియంత్రణకు మలేరియా శాఖ తీసుకుంటున్న చర్యలు క్షేత్ర స్థాయిలో పెద్దగా కనిపించడం లేదని పలువురు అంటున్నారు. అడపాదడపా అవగాహన కార్యక్రమాలు, తనిఖీలతోనే సరిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన ’ఫ్రైడే–డ్రైడే’ కూడా చాలా చోట్ల ఫొటోలకు పరిమితమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, ఫాగింగ్‌ను ముమ్మరం చేయడం, గ్రామాలు–పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం అత్యవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలతో దండెత్తిన దోమలు


