శ్రీవారి దర్శనానికి 15 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 78,067 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,158 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

అక్షర గోవిందానికి

సర్వం సిద్ధం

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం పాతకాల్వ పంచాయతీలో ఉన్న టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ వకుళామాత సన్నిధిలో శుక్రవారం అక్షర గోవిందం – అన్నప్రాసన కార్యక్రమం నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు టీటీడీ జేఈవో ఎ.శరత్‌ గురువారం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు వేదోక్తంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్ర మం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పా ల్గొనే ప్రతి చిన్నారికీ ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్‌ అందజేయనున్నట్లు తెలిపారు.

4 నుంచి ఆలయ అర్చకుల

పర్యవేక్షణలో..

జూలై 4వ తేదీ నుంచి ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు ఒక్కో బ్యాచ్‌కు 25 మంది చొప్పున రెండు బ్యాచ్‌లకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జేఈవో వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

రామచంద్రాపురం: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అసభ్య పదజాలాన్ని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఢిల్లీరాణి భానుకుమార్‌ తదితరులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలు, ఫోన్‌ సంభాషణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజా ప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఫోన్‌ కాల్‌ రికార్డులు, ఆడియోల ఆధారాలను పరిశీలించి ఎమ్మెల్యే పులివర్తి నానిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పంచవటి జ్యోతి, యశ్వంత్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, సెంథిల్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, బాబురెడ్డి, సతీష్‌రెడ్డి, ఇరగమరెడ్డి, చిరంజీవినాయుడు, మధు, భాస్కరయ్య పాల్గొన్నారు.

దేశ భవిష్యత్తును

నిర్దేశించేవి పరిశోధనలే

తిరుపతి సిటీ: భారత భవిష్యత్తును పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలే నిర్దేశిస్తాయని జాతీయ భద్రతా మండలి సభ్యులు, మాజీ డీఆర్‌డీఏ చైర్మన్‌, ఏరోస్పెస్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జీ.సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఎస్వీయూను సందర్శించి ఆయన సెనెట్‌ హాల్‌లో దేశంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశోధనాభివృద్ధి అకాడెమియా పాత్ర అనే అంశంపై జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ అభివృద్ధికి కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. వీసీ నర్సింగరావు నాయకత్వంలో విశ్వవిద్యాలయం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశోధన ప్రయోగశాలలు, సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, అంతరశాఖ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఏరోస్పేస్‌, రక్షణ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, పరిశోధనా అవకాశాలు, భవిష్యత్‌ సాంకేతిక రంగాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్ర సమాధానాలు ఇచ్చారు. వీసీ ప్రొఫెసర్‌ నర్సింగరావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు, డీన్‌ చెండ్రాయుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement