టీడీపీ యాప్‌లో ఓటర్ల వివరాలు నమోదు ఎన్నికల నిబంధనలకు తూట్లు అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు పక్కదారి పడుతున్న సర్ ప్రక్రియ ఆధారాలతో వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికారిక బూత్ లెవల్ ఏజెంట్లను పక్కన పెట్టి, ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించారని ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గం ప్రజాప్రతినిధి పీఏ కనుసన్నల్లో యాప్‌లో ఓటర్ల వివరాలు అప్‌లోడ్ చేస్తున్నారు. అనుకూల ఓటర్లను ఒకలా, వ్యతిరేక ఓటర్లను మరోలా వర్గీకరిస్తూ క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఓటు పవిత్రతను కాపాడాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నేతలు పెడచెవిన పెట్టారు. మై టీడీపీ యాప్ పేరుతో ఓటర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆధారాలతో సహా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాల పర్వం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓటర్ల గోపత్యను కాలరాస్తూ, మై టీడీపీ యాప్‌లో అనైతిక ఓటర్ల ప్రొఫైలింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న ఈ కుట్రపై అధికారులకు అందిన ఫిర్యాదులు సంచలనంగా మారాయి.
రహస్య ఓటు హక్కుకు భంగం
రాజ్యాంగం కల్పించిన రహస్య ఓటు హక్కు సూత్రానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటరు పేరు, ఐడీ కార్డ్ నంబర్‌తో పాటు వారి కులం, ఏ పార్టీ వైపు ఉన్నారనే అత్యంత సున్నితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.
ఆధారాలతో సహా ఫిర్యాదు
జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మై టీడీపీ యాప్‌లో ఓటర్ల నమోదు చిత్రాలు, ప్రైవేట్ వ్యక్తులు డేటా సేకరిస్తున్న వీడియోలు, క్షేత్రస్థాయి ఆధారాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించి పొలిటికల్ ప్రొఫైలింగ్ చేస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్‌ఏ (బూత్ లెవల్ ఏజెంట్) ల గుర్తింపు కార్డులను కచ్చితంగా ప్రభుత్వ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించాలన్నారు. సర్ ప్రక్రియ పురోగతిని ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసి పారదర్శకతను కాపాడాలని కోరారు.


