నగరి: విజయపురం మండలం ఇష్టకామేశ్వరపురం (గొల్లకండ్రిగ)–పన్నూరు సబ్‌స్టేషన్ క్రాస్ రోడ్డు సమీపంలోని చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీ య రహదారిపై ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధానంగా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆమె ఈ విషయాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్, ప్రాజెక్టు డైరెక్టర్, ప్రాంతీయ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. దీనిపై అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. భారతమాల పర్యోజన కింద నిర్మాణంలో ఉన్న చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీయ రహదారి ప్రాంతీయ అభివృద్ధికి కీలకమ ని తెలిపారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ప్రవేశం–నిష్క్రమణ మార్గం లేకపోవడం, ఈ రోడ్డుకు తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారితో అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రోడ్డు అనుసంధానంతో రాకపోకలు సులువు
ఇష్టకామేశ్వరపురం ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగినదని, విజయపురం, నిండ్ర మండలాలతో పాటు అనేక గ్రామాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగపడుతుందని ఆర్‌కే రోజా వివరించారు. ఈ ప్రాంతంలో ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపుతో పాటు అనుసంధాన రహదారి ఏర్పాటు చేస్తే ఎన్‌హెచ్–716, ఎన్‌హెచ్–716ఏ, తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారులతో సులభ అనుసంధానం ఏర్పడి చిత్తూరు, శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం, తిరుత్తణి, నాగలాపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర రవాణా మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు.
ర్యాంపు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు
ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విజయపురం, నిండ్ర మండలాల ప్రజలు చిత్తూరు తదితర పట్టణాలకు వేగంగా, సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు. అలాగే ఎన్‌హెచ్–716ఏతో రవాణా అనుసంధానం బలపడడంతో పరిశ్రమలు, సెజ్‌ల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని వెల్లడించారు. దక్షిణకాశి ఆలయం, ఆరే జలపాతం, సింగిరికోన, కై లాసకోన జలపాతం, శ్రీకాళహస్తి, కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సందించాలని కోరారు.


