మద్దతు ధర పేరిట మోసం | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర పేరిట మోసం

Jul 2 2026 2:11 AM | Updated on Jul 2 2026 2:11 AM

● ర్యాంపుల నిర్వాహకులు రైతులను దగా చేస్తున్నారు ● ఆర్డీవో కార్యాలయం వద్ద మామిడి రైతుల నిరసన

పలమనేరు : మామిడికి మద్దతు ధర ప్రకటించామని ప్రభుత్వం చెబుతూ మోసం చేసిందని జిల్లా మామిడి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు ఆరోపించారు. స్థానిక మామిడి రైతులు బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయ అధికారిణి తహసీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమాపతినాయుడు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి రిజిస్టర్‌ అయిన ర్యాంపుల్లో గత వారం కేజీకి రూ.4 ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రూ.3 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ ఆదేశాలను ర్యాంపు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ప్రభుత్వం కిలో మామిడి ధర రూ.7.50 లుగా ప్రకటించిందని, జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలు ఈ ధర ఇవ్వకుండా రూ.3లు ఇస్తున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సైతం కరువైందన్నారు. మనిషికి హానిచేసే పొగాకుకు బోర్డు ఉన్నప్పుడు, మామిడికి మాత్రం ఎందుకు మ్యాంగో బోర్డు లేదని ప్రశ్నించారు. కనీసం ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగినా ఈ ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ర్యాంపుల వద్ద ఇష్టానుసారంగా తక్కువ ధరలతో రైతులను మోసం చేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోయారన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో మాత్రం ధరలు బాగుంటే ఇక్కడ మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ నిరసనలో నేతలు సుబ్రమణ్యం నాయుడు, మధుసూధన్‌రావు, నరసింహారెడ్డి, దొరస్వామి నాయుడు, వాసు, విజయ్‌,యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement