చిత్తూరు ‘హై రోడ్డు’పనులు మళ్లీ మొదటికే రోడ్ల విస్తరణకు రూ.37 కోట్లు విడుదల చేసిన కేంద్రం స్థలాన్ని ఎన్‌హెచ్‌కు అప్పగించాల్సి ఉన్న కార్పొరేషన్ వంద స్థానంలో 80 అడుగుల విస్తరణపై అధికారుల దృష్టి పరిహారంపై ప్రభుత్వం డ్రామా.. టీడీఆర్ బాండ్లకు ఓకే భవన యజమానులతో చర్చిస్తామంటున్న అధికారులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని హై రోడ్డు విస్తరణ పనుల్లో మళ్లీ సందిగ్దత నెలకొంది. గత రెండేళ్లకు పైగా హై రోడ్డు విస్తరణ పనుల్లో నెలకొన్న నిర్లిప్తతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) శాఖ నుంచి విడుదలైన ఈ నిధుల ద్వారా త్వరలోనే టెండర్లు పిలిచి, ఆపై పనులు మొదలుపెడాతమని ఇటీవల కలెక్టర్ ప్రకటించారు. కానీ ఇక్కడున్న భవన యజమానులకు దీనిపై స్పష్టతలేదు. అధికారుల వద్ద సమాధానాల్లేవు.
పరిహారం మాటేంటి..?
ఇందులో మరో అంశం పరిహారం. విస్తరణలో భవనాలు కోల్పోయే యజమానులకు పరిహారం ఇవ్వా లని ఇప్పటికే అందరూ గట్టిగా ఉన్నారు. అయితే పరిహారం ఇవ్వాలంటే రూ.వందల కోట్లతో ముడిపడ్డ అంశమని, దీనికి తాము అనుకూలంగా లేమని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ బాండ్లను ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. టీడీఆర్ బాండ్లపై తమకు ఆసక్తి లేదని, ఏదైనా నగదు రూపంలో పరిహారం ఇవ్వాల్సిందేనంటూ కొందరు కోర్టు తలుపులు సైతం తట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారం ఇవ్వకుండా, టీడీఆర్ బాండ్లను ఇచ్చి భవన యజమానులకు విస్తరణకు ఒప్పించడం అధికారులకు కత్తిమీదసామే. అనేకమార్లు ఈ విషయమై హైరోడ్డు భవన యజమానులతో చర్చలు జరిపాల్సి ఉంది. వాళ్లు దేనికి అంగీకరిస్తారో తుదిగా తేలితేనే విస్తరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంతకూ ఎన్ని అడుగులు?
దాదాపు రూ.37 కోట్లతో చిత్తూరు నగరంలోని ఎంఎస్‌ఆర్ కూడలి నుంచి మురకంబట్టు బైపాస్ రోడ్డు వరకు హై రోడ్డును విస్తరించడానికి ఎన్‌హెచ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే రోడ్డును విస్తరించి, కాలువలు – డివైడర్లు నిర్మించే పనులు, ఇతర మౌలిక వసతులను మాత్రమే ఎన్‌హెచ్ శాఖ పూర్తి చేస్తుంది. ఇక్కడ భవన యజమానులకు పరిహారం ఇవ్వడానికి ఈ నిధులు కేటాయించలేదన్నది సుస్పష్టం. ఎన్‌హెచ్ పనులు మొదలుపెట్టాలంటే తొలుత మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై బరువు–బాధ్యత ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎంత వరకు..? అంటే ఉన్న రోడ్డుతో పాటు ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరణ పనులు మొదలు పెట్టాలి..? అనే విషయం మార్కింగ్ చేసి, ఆపై ఎన్‌హెచ్‌కు అప్పగిస్తే వాళ్లు పనులు చేస్తారు. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం హైరోడ్డును వంద అడుగుల వెడల్పుకు విస్తరించాలి. కానీ కొందరు భవన యజమానులు 80 అడుగుల విస్తరణకు సహకరిస్తామని చెబుతుంటే, మరికొందరు పనిలో పనిగా ఒకేసారి వంద అడుగులకు విస్తరించాలని కోరుతున్నారు. భవన యజమానుల సంఘంలో కూటమి పార్టీకి చెందిన ఓ వ్యక్తి పరిహారం విషయంలో గతంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం, ఆపై క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారా..? సొంత ప్రణాళిక తెరపైకి తీసుకొస్తారా..? అనేది తెలియడంలేదు.
మార్కింగ్ పూర్తి
హైరోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఎంఎస్‌ఆర్ కూడలి నుంచి మురకంబట్టు వరకు తొలి దశలో 4.31 కి.మీ విస్తరించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఓసారి భవన యజమానులతో సమావేశం నిర్వహించి కలెక్టర్‌కు నివేదిస్తాం. పనులు ప్రారంభమైతే త్వరలోనే పూర్తవుతాయి.
– నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్


