పలమనేరు: ‘ఏమన్నా టమాటా కోస్తాండవా..’ ‘అవు నప్పా.. ఈపొద్దూ 120 బాక్సులేసిండా మార్కెట్‌లో ఏట్టా ఉంది రేటు?’ ‘దాని మాట ఎందుకు చెబుతావాలే సామీ.. ఈ పొద్దు ఉండే ధర రేపుండదు, మొన్న 500 ఉండె. నిన్న బాక్సు వందకు పడిపాయ.. ఈ పొద్దు బాక్సు 200గా ఉంది. ఏం టమాటానో ఏమో.. ఎందుకు నాటినామా అనిపిస్తోంది.టమాటాలో ఏమో వచ్చేస్తుందనే ఆశతో అప్పో సప్పో చేసి పంట సాగు చేస్తే లాస్ట్‌కి మిగిలేదమీ లేదబ్బా, నర్సరీ వోళ్లు, దుక్కిదున్నే ట్రాక్టరోళ్లు, కూలీలు, ఎరువులు, మందుల వ్యాపారులు, పుర్రి, కట్టి, ఆటోవాళ్లు, బాక్సులో ళ్లు, మండీవోళ్లు,వ్యాపారులు.ఆకరుకి మనసరుకుని కొని బజార్లో బండ్లపై అమ్ముకునే చిరు వ్యాపారులు కూ డా బాగుండారు.నిండా మునిగిపోయిడేది రైతులు మాత్ర మే’ అంటూ పలమనేరులోని ఓ టీకొట్టులో ప్రస్తుత టమాటా సాగుపై ఇద్దరు రైతుల సంభాషణ ఇది.
ధరలు లాటరీగా మారాయి
టమాటా ధర ఏ రోజు ఎలా ఉంటాయో అర్థ కాని పరిస్థితి ఏర్పడింది. తోటల్లో మాగుతున్న కాయలను వదల్లేక కోసి వచ్చినంత రానీ అని రైతులు మార్కెట్‌కు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ధరలతో పంట సాగుకోసం పెట్టిన ఖర్చు సైతం రైతులకు దక్కేలా లేదు. పలమనేరు టమాటా మార్కెట్‌లో శుక్రవారం 14కిలోల బాక్సు అత్యధికంగా రూ.200గా పలికింది. సాధారణ ధర రూ.120గానే ఉంది. టమాటా పండించే రాష్ట్రాల్లో సీజన్ మొదలై భారీగా టమాటాలు వస్తున్నాయి. పొరుగునే ఉన్న అనంతపురం సరకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనా టమాటా ధరలు ఎప్పుడెలా ఉంటాయో తెలియక టమాటా సేద్యం రైతులకు లాటరీగా మారింది.
టమాటా సాధరణ సాగు 5వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు
ఇప్పుడు కోతదశలో ఉన్న తోటలు
520 హెక్టార్లు
పలమనేరు హార్టికల్చర్ డివిజన్‌లో సాగువివరాలు


