గణనాథుని సేవలో సంగీత దర్శకుడు కోటి | - | Sakshi
Sakshi News home page

గణనాథుని సేవలో సంగీత దర్శకుడు కోటి

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

కాణిపాకం: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి మంగళవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

నేటి నుంచి నాల్గో విడత ప్రవేశాలు

తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలలో భాగంగా అధికారులు నాల్గొవ విడత కౌన్సెలింగ్‌ కోసం మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఏ ఒక్క కళాశాలలోనూ కనీసం 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఇలా ఎన్ని విడతలు ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తారని, అధికారులు విద్యార్థులతో చలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

7న ప్లాస్టిక్‌ బకెట్‌ల ఈ–వేలం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్‌ బకెట్లను జూలై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ– వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండీ రూ.25 వేలు చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877–2264429 నంబర్‌లో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ను సంప్రదించాలని సూచించింది.

పంచాయతీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం

చంద్రగిరి: పంచాయతీ కార్మికుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్‌సీపీ బ్యానర్లను తొలగించేందుకు కార్మికులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఫలితంగా కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా నేతలు బ్యానర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం టీడీపీ నేతల ఆదేశాలతో వాటిని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి పూనుకున్నారు. వెంటనే పంచాయతీ కార్మికులందరూ వెంకంపేట వద్దకు రావాలంటూ హుకుం జారీచేశారు. పంచాయతీ కార్మికులు గుణశేఖర్‌, సతీష్‌ ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వెంకటంపేటకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుణశేఖర్‌కు తీవ్రగాయం కావడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. సతీష్‌ కుడి కాలికి తీవ్ర గాయమైంది.

ప్రమాదాన్ని పట్టించుకోని వైనం

రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై సిబ్బంది మండిపడ్డారు. రాజకీయ నేతల ఆదేశాలతో పంచాయతీ ఈఓ అవలంబించిని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement