చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పరిధిలోని 32 మండలాల్లో ‘సర్’ జాబితా ప్రకారం 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు 13,01,080 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందచేశారు. వాటిని తీసుకున్న ఓటర్లు సంబంధిత వివరాలను నమోదుచేసి.. మళ్లీ బీఎల్‌వోలకు అందజేయాలి. అనంతరం తొలి ప్రచురణ, ఆపై అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుంది. ఇదంతా జరగాలంటే ముందుగా ఓటర్లు తీసుకున్న ఫారాలను పూరించి ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు 40 వేల మంది మాత్రమే ఫారాలను పూరించి ఇచ్చారు. అంటే 29.80 శాతం మంది నుంచి ఫారాలను తీసుకున్న అధికారులు, వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగిలిన 13 లక్షల మంది ఇంకా ఇవ్వలేదు.
జిల్లాలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తడబడుతోంది. వచ్చేనెల 14వ తేదీలోపు తొలి దశగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) ఇచ్చి, వాటిని తిరిగి తీసుకోవాల్సి ఉంది. బీఎల్‌వోలు వాటిని ఓటర్లు అందజేస్తున్నారు. తిరిగి తీసుకోవడంలో తిప్పలు తప్పడంలేదు. కొన్నిచోట్ల ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఫారాలను రోజుల తరబడి ఇంట్లోనే ఉంచేసుకుంటున్నారు. వాటిని నింపడం ఎలాగో తెలియక కొందరు అలాగే పెట్టుకుంటున్నారు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీఎల్‌వోలపై ఒత్తిడి పెరుగుతోంది. అధికారుల నుంచి చీవాట్లు తింటున్నారు.
ఒత్తిళ్లతో సతమతం
ఓటర్లు ఎంతకూ ఫారాలు తిరిగి ఇవ్వకపోవడంతో, వాటిని పూరించి తీసుకునే బాధ్యత కూడా ఇప్పుడు బీఎల్‌వోలపైనే పడింది. ప్రతి రోజూ కనీసం వంద వరకు ఫారాలను పూరించి తీసుకోవాలని అధికారులు లక్ష్యం విధించారు. పైగా ప్రతి రోజూ అధికారులు ‘సర్’పై టెలీ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. ఈఎఫ్‌లను తిరిగి తీసుకునే క్రమంలో కుప్పం రూరల్ అత్యల్పంగా 20 శాతం, శాంతిపురంలో 21, చిత్తూరు అర్బన్‌లో 23, రామకుప్పంలో 24, బంగారుపాళ్యంలో 24.26, గంగాధరనెల్లూరులో 26, పుత్తూరు అర్బన్‌లో 26.91, వెదురుకుప్పంలో 27.5, ఐరాలలో 27.38, పాలసముద్రంలో 28.69 శాతంతో టాప్–10లో ఉన్నాయి. దీంతో ప్రతిరోజూ ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్సులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. చిత్తూరు కార్పొరేషన్, కుప్పం, బంగారుపాళ్యంలో పనిచేస్తున్న ముగ్గురు బీఎల్‌వోలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. చేస్తున్న ఉద్యోగం ఓవైపు, ‘సర్’తో మరోవైపు ఒత్తిడి పెరుగుతుండడంతో సిబ్బంది సతమతం అవుతున్నారు.


