చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 56 వినతులు అందాయి. ఏఎస్పీ షాను ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదునూ ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదుల పై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు.అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
హైస్కూల్ ప్లస్‌లలో
సర్దుబాట్లు వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో సర్దుబాట్లు వద్దని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను నియమించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక సర్దుబాట్లతో నియామకాలు చేపట్ట డం వల్ల విద్యాప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపారు. ఉపాధ్యాయుల సేవా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైస్కూల్ ప్లస్‌లలో అవలంబించిన ‘డిప్లాయ్‌మెంట్’ విధానాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను సీనియారిటీ ప్రకారం, అదనపు ఇంక్రిమెంట్‌తో ఈ పాఠశాలల్లో నియమించేవారని తెలిపారు. ప్రస్తుతం ఆ విధానాన్ని పక్కన పెట్టడం తగదన్నా రు. హైస్కూల్ ప్లస్‌లలో ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలన్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందన్నారు.
సీఎం పర్యటనపై సమీక్ష
కుప్పం రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 3, 4, 5 తేదీల్లో కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సోమవారం కుప్పం ఆర్డీవో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం మూడు రోజుల పర్యటనలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం వారు కడా పీడీ వికాస్ మర్మత్‌తో కలిసి సీఎం పర్యటించే పొగురుపల్లి ఇండస్ట్రియల్ పార్కు, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం, ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, ద్రావిడ విశ్వవిద్యాలయంలో హెలిప్యాడ్, కోటపల్లి వద్ద అధికారుల అతిథి గృహం, ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్ శంకుస్థాపన చేసే ప్రదేశం, శ్మశానవాటికను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
జూలై 2న ట్రాఫిక్ ఆంక్షలు
తిరుపతి క్రైం : సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జూలై 2న ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు. అదే రోజు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో నిర్వహించే బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు వెల్లడించారు.


