ఆన్‌లోడ్‌గాక గుజ్జు పరిశ్రమల ఎదుట బారులు తీరిన ట్రాక్టర్లు
టోకెన్లు అమ్ముకుంటున్నారు
చిత్తూరు జిల్లా పరిధిలోని గుజ్జు పరిశ్రమలను పరిశీలించిన ‘సాక్షి’ బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారులు పంపిణీ చేసే టోకెన్లు కొందరు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు అధికారులే.. టీడీపీ నాయకుల నివాసాలకు వెళ్లి వారు అడిగినన్ని టోకెన్లు ఇచ్చి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధరనెల్లూరు గుజ్జు పరిశ్రమల పరిధిలో రహ దారి పొడవునా మామిడి ట్రాక్టర్లు బారులు తీరా యి. కుళ్లిపోయిన మామిడి కాయలను రోడ్డుపక్కన పడేసి ఉండడం కనిపించింది. బాబు తీరుపై రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా 90 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ సారి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు గుజ్జు పరిశ్రమలు రూ.4 నుంచి రూ.6 చొప్పున తరలించారు. కొన్ని పరిశ్రమలు ఉన్నట్టుండి ధరలు తగ్గించేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి సానుభూతిపరులైన రైతులు పండించిన పంటను ఫ్యాక్టరీల వద్ద వేచి ఉండకుండా ఉండేలా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాయకులు సిఫారసులు చేస్తున్నారు. మరో వైపు ఉన్నతాధికారుల నుంచి గ్రామస్థాయి అధికారులు, పోలీసులు సైతం వారి బంధువులు, స్నేహితుల పంటను పైరవీలు చేసి అప్పటికప్పుడు అన్‌లోడింగ్ చేస్తున్నారు. కొందరు అధికారులు అన్‌లోడింగ్ కోసం ఇచ్చే టోకెన్లను రూ.500 నుంచి రూ.వెయ్యికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
కుళ్లిపోతున్నాయి!
జిల్లాలో సుమారు 44 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 32 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మరి కొన్ని వారంలో రెండు మూడు రోజులు క్లీనింగ్ పేరుతో అన్‌లోడింగ్ చేసుకోవడం లేదు. రోజుల తరబడి టోకెన్ల కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాము వారం, పది రోజులు వేచి ఉన్నా అన్‌లోడింగ్ చేసుకోవడం లేదని చిత్తూరు రూరల్ మండల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉండడం కారణంగా మామిడి పంట ట్రాక్టర్లలోనే కుళ్లిపోతోంది.


