పోలీసులపై దాడి హేయమైన చర్య | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై దాడి హేయమైన చర్య

Jun 30 2026 2:35 AM | Updated on Jun 30 2026 2:35 AM

శ్రీరంగరాజపురం : అమరావతిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం కానిస్టేబుల్‌ చిన్నతంబిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ అమరావతిలో రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ రౌడీ మూకలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మండలంలోని రాఘవరాజపురానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ చిన్నతంబికి గాయాలయ్యాయని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులకే రక్షణ లేకపోతే సామన్యుడి ప్రజల పరిస్థితి ఏమిటని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే పోలీసులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం చిన్నతంబికి పండ్లు అందించి, ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్‌, ఎంపీపీ సరిత, మాజీ సర్పంచ్‌ మల్లికమ్మ, నాయకులు అమృతరాజ్‌, ఆనంద్‌, యుగంధర్‌, భూపతిరెడ్డి, జనార్ధన్‌, మహేష్‌, జయ, రామకృష్ణ, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎకరాకు రూ.22 లక్షలు ఇవ్వాలని వినతి

పూతలపట్టు(యాదమరి): పరిశ్రమల స్థాపన కోసం సేకరిస్తున్న భూములు ఎకరాకు రూ.22 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పి.కొత్తకోట, పోటుకనుమ రైతులు కోరారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సోమవారం తహసీల్దార్‌ ఉదయ్‌ సంతోష్‌తో కలసి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో భూసేకరణపై రైతులతో సమావేశమయ్యారు. ఆర్డీవో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 95 ఎకరాలు భూమి అవసరమన్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. వీటికోసం గత కొన్ని నెలలుగా రైతులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భూములు కోల్పోయే రైతులకు ఎలాంటి నష్టం లేకుండా, పరిహారం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇస్తేనే భూములను ఇస్తామని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement