చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణంలో సోమవారం సహకార వారోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. జూలై 6 వరకు నిర్వహించనున్న వారోత్సవాలను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సహకార పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం సహకార శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి సహకార ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా రైతులకు మరింత విస్తృతంగా రుణాలు అందించి బ్యాంకుల అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆర్జించిన లాభాల నుంచి రూ.3,50,95,151 డివిడెండ్‌ను వివిధ సహకార సంఘాలకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ నానన్ అఫిషియల్ పీఐసీ సభ్యుడు అమాస రాజశేఖర్‌రెడ్డి, నాబార్డు జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా సహకార శాఖాధికారిణి ఎస్.లక్ష్మీ, జిల్లా సహకార ఆడిట్ అధికారిణి ఎస్.ఎం.ఎం.నారాయణమ్మ, డీసీసీబీ సీఈవో శంకరబాబు, డీజీఎంలు, ఏజీఎంలు, బ్యాంకు ఉద్యోగులు, సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


