చిత్తూరు అర్బన్ : తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారనే కోపంతో ఇద్దరిని హత్య చేసిన కేశవులు (54)కు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవా రం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరవణకుమార్ కథనం మేరకు.. చిత్తూరు రూరల్ మండలం నాయినిచెరువు పంచా యతీ చెన్నసముద్రం గ్రామంలో 2018 అక్టోబర్ 20వ తేదీన ఆర్టీసీ డ్రైవర్ పల్లెబోయిన శేఖర్, అతని చిన్నాన్న పి.లక్ష్మీపతి యాదవ్ హత్యకు గురయ్యారు. మృతుడు శేఖర్ తల్లి మాణిక్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి చిత్తూరు తాలూకా ఎస్‌ఐ భాస్కర్ కేసు నమోదుచేశారు. సీఐ శ్రీనివాసరావు దర్యా ప్తు చేపట్టారు. తన కుమార్తెను శేఖర్ లైంగిక వేధింపులకు గురిచేయడంతో మట్టుబెట్టాలని కేశవులు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని 2018 అక్టోబర్ 20న చెరుకుతోటకు రమ్మని కబురు పంపాడు. శేఖర్‌తో పాటు అతని బంధువు లక్ష్మీపతి కూడా వచ్చాడు. అప్పటికే కొడవలితో కాపుకాచిన కేశవులు తొలుత శేఖర్‌ను నరికి చంపాడు. విషయం బయటపడకుండా ఉండేందుకు లక్ష్మీపతిని సైతం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సాక్ష్యాధారాల తో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు.
పరాయి మోహం.. ప్రాణం తీసింది
– యువకుడిని చంపి,ఆత్మహత్యగా చిత్రీకరణ
చిత్తూరు రూరల్(కాణిపాకం): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియురాలి భర్త చేతిలో 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు మండలం కుర్చివేడులోని ఓ మామిడితోటలో ఆదివా రం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. గుడిపాల రామాపురానికి చెందిన వడివేలు, అతని భార్య మూడు నెలలుగా కుర్చివేడులోని గోవర్ధన్ మామిడి తోపులో కాపలా ఉంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు మండలం పాలంతోపు ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేష్ (19) తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వడివేలు అనుమానించాడు. ఆదివారం రాత్రి వెంకటేష్, వడివేలు దంపతులు కలిసి చికెన్ వండుకుని, పూట్‌గా మందు సేవించారు. అనంతరం వెంకటేష్‌ను ఇంటికి పంపించేసిన వడివేలు భార్యతో ఘర్షణకు దిగాడు. భార్యను కొట్టబోయాడు. అప్పటికే అక్కడి నుంచి వెళ్లినట్లు నటించిన వెంకటేష్ ఉన్నట్టుండి వచ్చి వడివేలును అడ్డుకున్నా డు. నా భార్యను నేను కొడుతుంటే.. నీకెందుకు అంత నొప్పి అంటూ వడివేలు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగక చీరతో మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వెంకటేష్ శవాన్ని ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. సోమవారం ఉదయం ఏమీ తెలియనట్టు ఊర్లో నాటకమాడాడు. సమాచారం అందుకుని ఘట నా స్థలానికి చేరుకున్న బీఎన్‌ఆర్‌పేట పోలీసులకు వడివేలు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భాకరాపేట: భాకరాపేట కనుమలో సోమ వారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కొండని ఢీకొట్టింది. స్థానికుల కథనం.. మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరింది. భాకరాపేట ఘాట్‌రోడ్డులో అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. దీంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.


