చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నికల సంఘం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి ఆరోపించారు. ఆయన సోమ వారం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి డీఆర్‌వో మోహన్ కుమార్‌కు ఫిర్యాదుచేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాల ఆధారాల ను వీడియోల రూపంలో డీఆర్‌వోకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని టీడీపీకి చెందిన యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారిక ప్రక్రియలో మాత్రమే సేకరించాల్సిన ఓటరు డేటాను, టీడీపీ తన సొంత ప్రయోజనాల కోసం యాప్‌లలో భద్రపరచడం తీవ్రమైన నేరమన్నారు. దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్ర భంగం వాటిల్లుతుందన్నారు. ఎన్నికల నియమావళి, డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమాచారాన్ని నిల్వ చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు జిల్లా ఎన్నికల అధికారి తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు యాప్ లోకి ఎన్యూమరేషన్ ఫారాలను అక్రమంగా అప్‌లోడ్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఓటర్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే అత్యంత గోప్యంగా నిర్వహించేలా బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఓటర్ల ప్రైవసీని ఉల్లంఘిస్తూ, ఎన్నికల నిబంధలను కాలరాస్తున్న వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్ల సమాచారం దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటూ, జిల్లాలో పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల వాతావరణం కల్పించాలన్నారు. డీఆర్‌వో స్పందిస్తూ ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్‌కు సమాచారం అందినట్లు తెలిపారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దినేష్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


