కాణిపాకం: తలకోన వెళ్లేందుకు భర్త నిరాకరించాడని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతిచెందింది. పోలీసులు కథనం మేరకు.. తవణంపల్లె మండలంలోని గల్లవల్లవూరు ఎస్‌టీ కాలనీకి చెందిన డి.పూర్ణిమ (24) తన మరదలితో కలిసి తలకోన వెళ్తానని భర్త లాలు ప్రసాద్‌ను అనుమతి కోరింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, మామిడి కోత పనులు ఉన్నాయని అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన పూర్ణిమ శనివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎం.రాజయ్య ఫిర్యాదు మేరకు తవణంపల్లె పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
పాలసముద్రం : తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ బలిజకండ్రిగ, కొత్తపల్లి వాసులు వాపోయారు. వారు సోమవారం గ్రామ సచివాలయం సమీపంలోని బలిజకండ్రిగ– చిత్తూరు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ పది రోజులకుపైగా మా గ్రామంలో తాగునీటికి అవస్థలు పడుతున్నామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శంకర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామ సమీపంలో గతంలో బోరు వేసి బోరు అమర్చలేదన్నారు. బోరు ఏర్పాటుచేయాలని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినాపట్టించుకోవడం లేదు. దీంతో తాము ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సతీష్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. సాయంత్రంలోగా బోరు మోటారు అమర్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.


