తోతాపురిని బేనీషాగా మార్చేద్దాం! | - | Sakshi
Sakshi News home page

తోతాపురిని బేనీషాగా మార్చేద్దాం!

Jun 29 2026 5:28 AM | Updated on Jun 29 2026 5:28 AM

పాత చెట్టులో వేర్వేరు రకాల సృష్టి

మార్కెట్‌ బాగున్న రకాల తోటలుగా

రూపాంతరం

ఎకరా తోటకు అయ్యే ఖర్చు రూ.8 వేలు

రెండేళ్ల తర్వాత పాత చెట్లలోనే కోరుకున్న రకం రెడీ

జిల్లాలో ఎక్కువగా తోతాపురి మామిడి రకం తోటలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తున్నా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కాయలను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. దీంతో ప్రతి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే తోతాపురి మామిడి తోటలను అంటు కట్టుతో (గ్రాఫ్టింగ్‌) ఎక్కువ ధర ఫలికే టేబుల్‌ రకాలైన బేనీషా, ఖాదర్‌, ఆల్ఫాన్సాలుగా మార్చుకోవచ్చు. నష్టాలు రాకుండా గిట్టుబాటు ధర పొందవచ్చు. ఎకరా తోటల్లోని చెట్లను అంటు కట్టడానికి రూ.5 వేలు ఖర్చు అవుతుంది. రెండేళ్ల తర్వాత కోరిన మామిడి రకాలను పొందవచ్చు. ఇప్పటికే జిల్లాలోని కొందరు రైతులు తోతాపురి చెట్లలో టేబుల్‌ రకాలను పండించి లాభాలు గడిస్తున్నారు.

పలమనేరు: చిత్తూరు జిల్లాలో 55 లక్షల హెక్టార్లలో మామిడి తోటల సాగు ఉంది. వాటిలో 60 శాతానికి పైగా తోతాపురి రకం మామిడి చెట్లు ఉన్నాయి. ఈ కాయలను జ్యూస్‌ ఫ్యాక్టరీలు పల్ప్‌ కోసం కొంటాయి. దీనికి గ్యారెంటీ మార్కెటింగ్‌ ఉంటుంది. తర్వాతి స్థానంలో టేబుల్‌ రకాలైన బేనీషా, ఖాదర్‌, బయ్యగానిపల్లి, మల్లిక రకాలు ఉన్నాయి. తోతాపురం రకం ప్రతి ఏటా సరాసరి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. మిగిలిన రకాలు రెండు లక్షల టన్నుల వరకు వస్తుంది. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి తోతాపురి రైతులకు తిప్పలు తప్పడం లేదు. పల్ప్‌ ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు కోసం పలు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాయలను అన్‌లోడింగ్‌ చేయడానికి వారం రోజులు పడుతుండడంతో సగం కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు అంటుకట్టు ద్వారా పాత చెట్లలోనే కొత్త రకాలు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు 4 వేల హెక్టార్లలోని తోటల్లో బేనీషా, ఖాదర్‌, బయ్యగానిపల్లి, మల్లిక తదితర రకాలను టాప్‌ వర్కింగ్‌ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్‌ వర్కింగ్‌ జూన్‌, జూలై నెలల్లో జరుగుతూ ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్‌ వర్కింగ్‌, గ్రాఫ్టింగ్‌ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి.

కొమ్మ అంటుకట్టుతో కోరిన రకం

జిల్లాలో మామిడి సాగు 55 లక్షల హెక్టార్లు

మామిడి రైతులు 26 వేల మంది

అత్యధికంగా సాగులో ఉన్నది తోతాపురి

సరాసరి పంట దిగుబడి 5 లక్షల టన్నులు

టాప్‌ వర్కింగ్‌ చేపట్టిన తోటలు

4 వేల హెక్టార్లు

అంటు ఎలా కడతారంటే..?

వైరెటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనీషా చెట్టును(మదర్‌ ప్లాంట్‌) ఎంపిక చేసుకోవాలి. తోటలోని అనవరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్‌ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో ధృడంగా ఉన్న చిగుర్లను ఎంపిక చేసుకొని మిగిలిన వాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్‌ ప్లాంట్‌ నుంచి చిగుర్లను కట్‌ చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్‌ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలైన రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్‌ ట్యాగ్‌ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలు అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుకట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాది నుంచి కోతకొస్తాయి. ఎకరాకు సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆలెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.8 లెక్కన రూ.8 వేలు అవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement