దోపిడీ ఫారం | - | Sakshi
Sakshi News home page

దోపిడీ ఫారం

Jun 29 2026 5:28 AM | Updated on Jun 29 2026 5:28 AM

● ఎన్యూమరేషన్‌ ఫారం పూరించేందుకు రూ.50 వసూలు ● చేతులెత్తేసిన బీఎల్వోలు, ఆన్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లాలంటూ సలహాలు ● దిక్కుతోచని స్థితిలో నిరక్షరాస్య ఓటర్లు ● పట్టించుకోని అధికారులు

నాకు ఫారం నింపడం రాదు

మాకు ఫారం నింపడం రాదు. సారోళ్లను అడిగితే మీ సేవ సెంటర్‌కు పొమ్మన్నారు. అక్కడ రూ.50లు అడుగుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్లం. వచ్చేది అరకొర ఆదాయం. ఓటు కోసం యాభై రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? అధికారులేమో కచ్చితంగా రాసి తీసుకురమ్మని చెబుతున్నారు.

– రాములమ్మ, వృద్ధురాలు, కుప్పం

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఓటు హక్కు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులకు శాపంగా మారుతోంది. ఇందులో ఎన్యూమరేషన్‌ (ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు) ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత కనబరుస్తుండడంతో నిరక్షరాస్యులైన ఓటర్లు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దీన్ని సిబ్బంది చేయాల్సి ఉండగా మీసేవా, ఆన్‌లైన్‌ కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. వారు ఒక్కొక్క ఫారం పూరించడానికి రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని సామాన్య, మధ్యతరగతి ఓటర్లు లబోదిబోమంటున్నారు. సర్‌ ఎన్యూమరేషన్‌ ఫారాల నమోదు దోపిడీ పర్వంపై సాక్షి ఫోకస్‌.

చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ : జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో సర్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఓటర్ల ఎన్యూమరేషన్‌ ప్రక్రియలో ఫారా లు పూర్తి చేయడం నిరక్షరాస్యులైన ఓటర్లకు పెద్ద సమస్యగా మారింది. ఎన్యూమరేషన్‌ ఫారంలో వివరాలు ఎలా నింపాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, చదువుకోని వారు ఈ ప్రక్రియను పూర్తి చేయలేక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

బీఎల్వోల నిర్లక్ష్యం – మీ సేవకు దారి

నిబంధనల ప్రకారం ఓటరు నమోదు, ఎన్యూమరేషన్‌ ప్రక్రియలో బీఎల్వోలు ఓటర్లకు మార్గదర్శకత్వం వహించాలి. అవసరమైతే ఫారాలు పూరించడంలో సహాయం చేయాలి. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ‘మాకు టైం లేదు.. మా వల్ల కాదు.. మీ సేవ, ఆన్‌లైన్‌ సెంటర్లకు వెళ్లి ఫారం పూరించుకుని రండి’ అంటూ బీఎల్వోలు ఓటర్లను వెనక్కి పంపుతున్నారు.

ఆన్‌లైన్‌ కేంద్రాల కాసుల కక్కుర్తి

బీఎల్వోల ఉచిత సలహాతో ఓటర్లు మీ సేవా, ఆన్‌లైన్‌ కేంద్రాల బాట పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు కేంద్రాల నిర్వాహకులు నిరక్షరాస్యులైన ఓటర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా జరగాల్సిన ఈ పనికి, ఒక్కో ఫారం పూరించడానికి ఏకంగా రూ.50 వసూలు చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లే పేదలు, వృద్ధులు ఒక్క ఫారానికి ఇంత మొత్తంలో ఇచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మాకు తెలియదు

ఎన్యూమరేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా సాగాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ కేంద్రాల దోపిడీపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇష్టానుసారంగా నిరక్షరాస్యులైన ఓటర్ల నుంచి ఆన్‌లైన్‌ కేంద్రాల నిర్వాహకులు దోచేసుకుంటున్నారు. ఓటర్ల ఎన్యూమరేషన్‌ ప్రక్రియను ప్రైవేట్‌ కేంద్రాల దోపిడీకి వదిలేయకుండా, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉండి ఉచితంగా ఫారాలు పూరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, తక్షణమే నిఘా పెట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement