● భూమన కరుణాకరరెడ్డి ఫైర్
తిరుపతి మంగళం : సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్ అసమర్థత వల్లే మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, వపన్‌కళ్యాన్ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. మామిడి కిలోకి రూ.15 గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ పెట్టిన కూలీలు రావని రైతులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లేక సుమారు 2 లక్షల టన్నుల మామిడి కాయలు చెట్ల కింద రాలి కుళ్లిపోతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కిలోకి రూ.4 ధర ప్రకటించి చేతులు దులు పేసుకుందని మండిపడ్డారు. ఫల్ఫ్ ఫ్యాక్టరీల వద్ద మామిడి లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, రైతులకు రూ.250 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో కిలోకి రూ.20 నుంచి రూ.25 ధర కల్పించిన ఘనత జగనన్నదేనన్నారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
పోలియో చుక్కలకు యాప్ తిప్పలు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్స్ పోలియోలో పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే యాప్ సాంకేతిక సమస్యలతో గంటన్నరకు పైగా పనిచేయలేదు. దీంతో నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. పోలియో చుక్కలు వేసుకున్న ప్రతి చిన్నారి వివరాలతో పాటు అభా నంబర్‌ను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించడంతో సిబ్బంది విస్తుపోయారు. యాప్ పనిచేయకపోవడంతో ముందుగా కాగితాలపై వివరాలు నమోదు చేసి, అనంతరం యాప్‌లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అదనపు పనిభారం పడిందని సిబ్బంది వాపోయారు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది అభా, ఆధార్ వివరాలు అడగడం తల్లిదండ్రుల్లో అయోమయానికి దారితీసింది. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన డీఎంఅండ్‌హెచ్‌వో, పోలియో చుక్కల కోసం ఆధార్ అడగరాదని స్పష్టం చేస్తూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు.


