నిండు జీవితానికి రెండు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

నిండు జీవితానికి రెండు చుక్కలు

Jun 29 2026 5:28 AM | Updated on Jun 29 2026 5:28 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : ఐదేళ్లలోపు చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అవసరమని, అవి జీవన రక్షణ కవచంగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని టెలిఫోన్‌ కాలనీలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన దిశగా విశేష పురోగతి సాధించినప్పటికీ, కొన్ని దేశాల్లో ఇంకా ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పోలియో మళ్లీ ప్రబలకుండా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,077 పోలియో బూత్‌లు, 119 రూట్లు, 106 హైరిస్క్‌ ప్రాంతాల్లో 63 మొబైల్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 4,434 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మొద టి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి 100 శాతం పోలి యో చుక్కలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్ల డించారు. కార్యక్రమంలో డీఐవో హనుమంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌, క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్‌, చుడా చైర్మన్‌ కఠారి హేమలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement