చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధిని కల్పిస్తూ కొండంత అండగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలతో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్–గ్రామీణ్ (వీబీ జీ రామ్‌జీ) పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం జూలై 2 నుంచి ప్రారంభం కానుంది.
రెండు దశాబ్దాల ఉపాధి హామీకి ముగింపు
గ్రామాల్లోని పేద ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళ్లకుండా సొంత ఊర్లలోనే జీవనోపాధి కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది సామాన్యులకు ఆర్థిక భరోసానిచ్చింది. ఎంతో మంది సొంత ఊర్లలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తద్వారా వలసలు దాదాపు ఆగిపోయాయి. అలాంటి పథకం మరో రెండు రోజుల్లో ముగియనుంది. దాని స్థానంలో జూలై 2వ తేదీ నుంచి ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం అధికారికంగా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానుంది.
అదనపు ఆర్థిక భారం
ఈ నూతన పథకం వల్ల ప్రభుత్వంపై గణనీయమైన ఆర్థిక భారం పడనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పాత, కొత్త పథకాల నిధుల వాటాల వ్యత్యాసాన్ని గమనిస్తే పాత ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కేంద్రం వాటా 90 శాతం ఉండగా రాష్ట్రం వాటా 10 శాతం ఉండేది. నూతన పథకం (వీబీరామ్‌జీ) అమలైతే కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తన నిధుల వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30 శాతం నిధులను సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఉపాధి కల్పన నిమిత్తం భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై భారీగా అదనపు భారం పడనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
నూతన సంస్కరణలు
కొత్తగా అమలు కానున్న ‘వీబీ జీ రామ్‌జీ’ పథకంలో ప్రభుత్వం పలు మార్పులు, సామాజిక తనిఖీ నిబంధనలను తీసుకువచ్చింది. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఏడాదికి 125 రోజుల పని కల్పించనున్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి కూలీల ఖాతాల్లో వేతనాలు నేరుగా జమవుతాయి. ఒకవేళ ఈ ప్రక్రియలో ఏదైనా కారణంతో ఆలస్యమైతే అందుకు తగ్గట్టుగా కూలీలకు ప్రత్యేక పరిహారం చెల్లించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ పథకం వల్ల వ్యవసాయ రంగానికి, స్థానిక రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకం అమలును పకడ్బందీగా పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామాలను ఏ, బీ, సీ విభాగాలుగా వర్గీకరించనున్నారు. పనుల్లో పారద ర్శకతను పెంచేందుకు ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఫిర్యాదుల స్వీకరణ, త్వరితగతిన పరిష్కారం కోసం సరికొత్త వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు.
జిల్లా సమాచారం
ఉపాధిలో నమోదైన కుటుంబాలు
5,21,021
నమోదైన ఉపాధి కూలీలు 9,21,839
ఉపాధి పొందుతున్న కుటుంబాలు
2,99,253
ఉపాధి పొందుతున్న కూలీలు 4,68,030


