టమాట ధరలు పతనం | - | Sakshi
Sakshi News home page

టమాట ధరలు పతనం

Jun 29 2026 12:23 AM | Updated on Jun 29 2026 12:23 AM

● 15 కిలోల బాక్స్‌ రూ.170 పలుకున్న వైనం ● పెట్టుబడి కూడా అందడం లేదని రైతుల ఆవేదన ● ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకోలు

బైరెడ్డిపల్లె : నిన్నమొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. 15 కిలోల బాక్సు రూ.50 నుంచి అత్యధికంగా రూ.170 పలికింది. దీంతో కాయలు కోసేందుకు కూలీలు, మార్కెట్‌కు తరలించే ఆటో బడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కాయలు ఎక్కువగా దిగుబడి ఉండడం, ఇతర మార్కెట్లకు అధికంగా సరుకు రావడంతోనే ధరలు పతనమైన ట్టు కమిషన్‌ మండీ వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలో సుమా రు 10 వేల ఎకరాల్లో టమాట పంట సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాధారణ టమాట సాగు చేస్తుండగా, మరి కొన్ని చోట్ల తీగజాతి టమాటతో పాటు పందిళ్లతో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందు లు, పందిరి ఖర్చు కలిసి భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అన్నీ సాఫీగా సాగి మంచి ధర పలికితే రైతుకు కొంతమేర ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా తెగుళ్లు, ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గంలోని పలమనేరు, వికోట ప్రాంతాల్లో ప్రత్యేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కడలూరు, పాండిచ్చేరి, విజయవాడ, మదురై, విజయనగరం, హైదరాబాదుకు టమాటాల ను ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం అక్కడ సరుకు ఎక్కువగా ఉండడంతోనే ధరలు పతనమైనట్టు వ్యాపారులు చెబుతున్నారు.

తోటలోనే మాగుతున్న టమాటాలు

టమాట ధరలు పతనమై పెట్టుబడి, కోత, రవాణా ఖర్చులు కూడా అందకపోవడంతో రైతులు కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం కాయలు కాపునకు రావడంతో డిమాండ్‌ తగ్గడం, దిగుబడి అధికం కావడంతో ధరలు అమాంతంగా పడిపోయినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరలు ఇలాగే కొనసాగితే అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యవసాయం దండగ అనిపిస్తోంది

అప్పు చేసి పెట్టుబడి పెట్టి కష్టపడి పంట సాగు చేస్తే కాయలను కొనుగోలు చేసేనాథుడే లేడు. కాయలను మార్కెట్‌కు తరలించాలన్నా వాహనాల అద్దె, ఇతర ఖర్చులు రావడం లేదు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి గమనిస్తే వ్యవసాయమే దండగ అనిపిస్తోంది. – ఖాదర్‌భాష, పాతపేట

భారీగా నష్టపోయాను

ఎన్నో ఆశలతో టమాట పంట సాగు చేశాను. ప్రస్తుతం కాయలను కోస్తున్నాం. మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. పంట దిగుబడి ఎక్కువగా వచ్చినా సంతోషం లేదు. 15 కిలోల బాక్స్‌ రూ.150 ధర పలికితే ఏమి గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం స్పందించి టమాట రైతులకు ఆదుకోవాలి. – వెంకటరమణ, రామనపల్లె

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement