చిత్తూరు కలెక్టరేట్ : పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడంతోపాటు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాల వికాస్ ఎంతో దోహదం చేస్తుందని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు మధుసూద తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల్లో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో బాల వికాస్ పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ 5 నుంచి 15 ఏళ్లలోపున్న బాలబాలికలకు వారానికి రెండు గంటల పాటు పలు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సర్వమత సమన్వయం, కుటుంబ భద్రత, వ్యక్తిగత ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తామని వివరించారు. నగరంలోని పలు పాఠశాలల్లో బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించి పుస్తకాలను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. జిల్లా బాలవికాస్ సమన్వయకర్త జి.శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల వికాస్ బోధనా అంశాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ ప్రభాకర్ నాయుడు, జిల్లా పదాధికారులు జి.శంకర్, సాయిప్రకాష్, శ్రీనివాసన్, శేష నారాయణ, బాలవికాస్ గురువులు అనురాధ, సావిత్రి, యామిని సాయిలక్ష్మి, లావణ్య, కమలప్రభ తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ కెమెరాలతో మామిడి ట్రాక్టర్లపై నిఘా
గుడిపాల: మామిడి కాయలను తీసుకువచ్చిన ట్రాక్టర్లు సిఫార్సులతో కాకుండా సీరియల్ నంబర్ ప్రకారం ఫ్యాక్టరీలోకి వెళ్లేలా డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. వారు ఆదివారం మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద డ్రోన్ కెమెరాలతో ట్రాక్టర్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఇకపై సిఫార్సులకు చెక్‌పెట్టి రెవెన్యూ సిబ్బందితో ప్రతిరోజూ వాహనాలకు టోకెన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎక్కడా సిఫార్సులకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రైతుల ట్రాక్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్‌లోడింగ్ చేసే బాధ్యత తాము చూసుకుంటామన్నారు.
రైలు కిందపడి ఇద్దరు యువకుల ఆత్మహత్య
కుప్పం రూరల్ : కుప్పం రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం వేర్వేరు చోట్ల రైలు కింద పడి ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కుప్పం రైల్వే పోలీసుల కథనం మేరకు.. కుప్పం పట్టణం మునస్వామిపురం కాలనీకి చెందిన నిచ్చల్ (32) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గుర్తు తెలియని యువకుడు కుప్పం – మల్లానూరు రైల్వే మార్గంలో వానగుట్టపల్లి వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడు నల్లటి షర్టు ధరించాడని, 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9000716436 నంబరులో కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహాలను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిచ్చల్
రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని యువకుడి మృతదేహం


