పలమనేరు: జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులకు విద్యాశాఖ చుక్కలు చూపిస్తోంది. వీరికి ప్రమోషన్లు ఇచ్చి పర్మినెంట్ ప్లేస్‌లను తీసేసింది. ముఖ్యంగా సర్‌ప్లస్ టీచర్లకు రోజుకో స్కూల్ లెక్కన డిప్యుటేషన్లు వేస్తున్నారు. ఎక్కడ టీచర్ సెలవు పెడితే అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్లో తమను నియమించకుండా కొత్తగా డీఎస్సీలో ఎంపికై న వారికి పర్మినెంట్ పోస్టులు ఇస్తున్నారని క్లస్టర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ సెలవుంటే అక్కడికెళ్లాల్సిందే..
క్లస్టర్ టీచర్లుగా కేటాయించిన వారికి పర్మినెంట్ స్థానం కేటాయించలేదు. వారిని ఆయా ఎంఈవోలకు అటాచ్ చేయడంతో వారు డిప్యుటేషన్‌పై ప్రైమరీ స్కూళ్లలో సెలవు పెట్టిన టీచర్ స్థానంలో విధులకు వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రధానంగా క్లస్టర్ టీచర్లుగా కేటాయించిన వారిలో ఎక్కువగా భాషాపోధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో విధులు కేటాయించలేదు. దీంతో వీరు ఆ హైస్కూల్ పరిధిలోని ఏ స్కూల్‌కై నా వెళ్లాల్సి వస్తోంది. గత ఆరేళ్లుగా డీఈవో పూల్ మగ్గి ఇటీవలే పదోన్నతలు పొందిన వీరికి ఇప్పుడు నరకంగా మారింది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. దీనిపై ఏ ఉపాధ్యాయ సంఘం కూడా నోరుమెదపడం లేదు. తమకు ఉపశమనం కల్పించాలని బాధిత టీచర్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.


