చిత్తూరు కలెక్టరేట్ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల నిలువుదోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. చిత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఆ సంఘం జిల్లా కన్వీనర్ మసూ ద్ అధ్యక్షతన జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తూ భవిష్యత్తు తరాలకు చదువును దూరం చేస్తోందని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ వేధిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వారి ఒత్తిడి తాళలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా విద్య, వైద్యం అందించాల్సిన పాలకులు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి మాట్లాడు తూ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సైకిల్ యాత్ర నిర్వహించి విజయం సాధించామని గుర్తుచేశారు. జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐని మరింత బలోపేతం చేయడం ద్వారానే విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నాయకుడు బాలసుబ్రమణ్యం, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాయనూరు అడవిలో ఏనుగుల సంచారం
కుప్పం రూరల్ : తమిళనాడు నుంచి వచ్చి రామకుప్పంలో తిష్టవేసిన రెండు ఏనుగులు శనివారం రాత్రి కుప్పం మండలం నాయనూరు అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు కుప్పం రేంజర్ జయశంకర్ తెలిపారు. వాటిని తమిళనాడులోకి తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితులైతేనే బయటికి రావాలని సూచించారు. అదేవిధంగా ఏనుగులు మేత కోసం అటవీ గ్రామాల వైపునకు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ సిబ్బంది నాయనూరు ప్రాంతంలో ఉండి ఏనుగులు జనావాసాల వైపు రాకుండా చూస్తున్నట్లు చెప్పారు.


