ఓటర్లను సచివాలయాలకు పిలిపించుకుంటున్న బీఎల్వోలు. పక్కదారి పడుతున్న ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ఎన్నికల నిబంధనలు అమలు చేయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓటర్లు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ జిల్లాలో క్షేత్రస్థాయిలో పక్కదారి పడుతోంది. ప్రతి ఓటరునూ వ్యక్తిగతంగా కలవాలి.. ప్రతి ఇంటి గడప తొక్కాలి అన్నది ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశం. క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లడం లేదు. ఓటర్లను స్థానిక సచివాలయాలకో, తమకు అనుకూలమైన ఏ ఇతర కార్యాలయం వద్దకో పిలిపించుకుంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి నమోదు చేసుకుని తిరిగి ఇవ్వాలని సూచిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఎలా చేయాలంటే..
● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్చడం, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం కోసం బీఎల్వోలు కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. జిల్లాలో చాలా చోట్ల బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎన్యూమరేషన్ ఫారాలను సచివాలయాల్లో కుప్పలుగా పెట్టుకుని కూర్చుంటున్నారు. ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ ఓటర్లనే అక్కడికి రావాలని హుకుం జారీ చేస్తున్నారు.
జాబితా లీకేజీలు.. దొంగ ఓట్ల భయం
ఇంటింటి సర్వే జరగకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఆశించిన లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే ఇంట్లో లేని వ్యక్తులను ఉన్నట్లుగా చూపించడం, ఫోన్ సమాచారంతోనే ఫారాలు పూర్తి చేయడం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అలాగే చనిపోయిన వారు, ఊర్లో లేని వారి పేర్లు కూడా జాబితాలో కొనసాగే ప్రమాదం ఉంది. ఎన్నికల నిబంధనలను క్షేత్రస్థాయిలో ఉల్లంఘిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్యాలయాల్లో ఉంటున్నారు
కూలి పనులు మానుకోవాల్సి వస్తోంది
మా బీఎల్వో ఫోన్ చేసి సచివాలయానికి రమ్మన్నారు. నేను రానయ్యా.. ఇంటికి వచ్చి చూసుకోమంటే, సమయం లేదు బాబూ.. ఇక్కడికే వచ్చేయ్ అంటున్నారు. రోజు కూలికి వెళ్తేనే ఇల్లు గడిచే పరిస్థితి మాది. ఓటు పోతుందేమోనని భయంతో ఒకరోజు కూలి నష్టపోయి ఇక్కడికి వచ్చాను.
– కె.రామయ్య, కూలీ
ఇంటికి రావడం లేదు
ఎన్నికల రూల్స్ ప్రకారం వాళ్లే మా ఇంటికి రావాలి. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇళ్లలో ఎవరు ఉంటున్నారు, ఎవరు చనిపోయారు అనేది ఆఫీసుల్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది? ఇలాగైతే దొంగ ఓట్లు ఎలా తగ్గుతాయి? ఉన్నతాధికారులు వెంటనే విచారించి యాక్షన్ తీసుకోవాలి.
– సరిత, గృహిణి
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2500 మంది బీఎల్‌వోలను నియమించారు. వారు సచివాలయాలు, వీఆర్వో ఆఫీసులు వేదికగా నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఓటర్లు పనులు మానుకుని గంటల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు బీఎల్వోల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


