చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగిసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించి మళ్లీ సర్పంచులను ఎన్నుకోవాల్సి ఉండగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో గ్రామ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎన్నికలకు సిద్ధమైనట్టు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అసెంబ్లీ ఓటర్ల జాబితాను నమూనాగా తీసుకుని గ్రామాల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో పంచాయతీ సిబ్బంది ఓటర్ల జాబితాలను సిద్ధం చేశా రు. ఆశావాహులు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
9 నెలల ముందే షెడ్యూల్
రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గత ఏడాది అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోగా వార్డుల వారీ ఓటర్ల జాబితాల ప్రచురణ, నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్ 16 నుంచి 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, డిసెంబరు 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విమర్శలు రావడంతో ఏప్రిల్‌లో ఓటర్ల జాబితాను పూర్తి చేసింది. కొత్త ఓటర్ల జాబితాలను ఇటీవల ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాల ప్రకారం జిల్లాలో పురుషుల కంటే 11,388 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధమవడంతో పల్లె సంగ్రామంలో పాల్గొనాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. పలువురు ఆశావహులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పాలన పై ప్రజల అసంతృప్తి
ఏప్రిల్ 3 నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. త్రీవ పనిభారంతో ఉన్న అధికారులు తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి. ప్రత్యేకాధికారుల పాలన సక్రమంగా లేక గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు పల్లె ప్రజలను వేధిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కలగా మారింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణను పట్టించుకునే నాథుడే లేడని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్‌లో..?
జెడ్పీ పాలకవర్గం గడువు సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో జెడ్పీతో కలిపి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం యోచిస్తోందని పంచాయతీ అధికారులు అంటున్నారు.
జిల్లా పంచాయతీ ఓటర్ల సమాచారం
గ్రామ పంచాయతీలు 621
వార్డులు 5,914
ఓటర్లు 10,26,821 మంది
పురుషులు 5,07,703 మంది
మహిళలు 5,19,091 మంది
ఇతరులు 27 మంది
రిజర్వేషన్ల ఖరారు ఎప్పుడు?
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. గత రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి తమకే చాన్స్ వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశాావహులు.. ముఖ్యంగా అధికార కూటమికి చెందిన వారు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అది తేలిన తరువాత కానీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కాదని అంటున్నారు. ఆ తతంగం త్వరలో పూర్తయ్యేలా ఉందని అధికారులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలిచేందుకు పలువురు సర్వ శక్తులతో రెడీ అవుతున్నారు. వీరిలో అనేక మంది ఇప్పటికే స్థానికుల అవసరాలపై దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రూపుల వారిగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యులకు తాయిలాలు ఎరచూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో గట్టి పోటీ నెలకొని ఉండడంతో రూ.లక్షల్లో సైతం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


