వి.కోట : మండలంలోని వి.కోట–పెర్నంబట్టు జాతీయ రహ దారి సుద్దులకుప్పం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి కారు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి(70) శుక్రవారం రాత్రి సుద్దుల కుప్పం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా వి.కోట నుంచి పెర్నంబట్టు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతని వివరాలు ఎవరికై నా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ తెలియజేయాలని సూచించారు.
చిత్తూరు అర్బన్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి బంగారు ఆభరణాలను మరో మహిళ చోరీ చేసింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన పద్మావతి శుక్రవారం తన బంధువు చనిపోవడంతో చిత్తూరుకు వచ్చారు. అదేరోజు సాయంత్రం ఆర్టీసీ బస్సు లో తిరుపతి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే తన పరుసు కనిపించలేదు. పర్సులో 10 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో ప్రయాణికురాలి అవతారంలో ఉన్న ఓ మహిళ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.


