కాణిపాకం: శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ హరీష్‌కుమార్ గుప్త కోరారు. ఆయన శనివారం కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, డీఎస్పీ జె.వెంకటనారాయణ, ఈవో పెంచల కిషోర్ డీజీపీకి స్వామిచిత్రపటం అందజేశారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్త మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాల ని, శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక, ప్రజా కేంద్రిత పోలీసు సేవలను అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతికత ఆధారిత ఆధునిక పోలీసింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.


