కుప్పం బాధ్యతల నుంచి కంచర్లకు ఉద్వాసన సొంత పార్టీ వారికీ తప్పని బాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

కుప్పం బాధ్యతల నుంచి కంచర్లకు ఉద్వాసన సొంత పార్టీ వారికీ తప్పని బాబు వెన్నుపోటు

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

● తప్పులతో తనకు సంబంధం లేదని చెప్పే యత్నం ● స్థానిక ఎన్నికల కోసమే డ్రామాలు?

● తప్పులతో తనకు సంబంధం లేదని చెప్పే యత్నం ● స్థానిక ఎన్నికల కోసమే డ్రామాలు?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను అకస్మాత్తుగా తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నీ తానై అడ్డగోలుగా కుప్పాన్ని ఏలిన నాయకుడికి ఉద్వాసన పలకడం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. విజయవాడలో ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుప్పంలో తన వ్యవహారాలను చూసేందుకు అనంతపురానికి చెందిన మరో శ్రీకాంత్‌ను పంపుతున్నట్టు చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అన్ని తప్పులకు స్థానిక నాయకులను బలిపశువులుగా చేసేందుకే ఈ ఎత్తులు వేశారని చెబుతున్నారు.

మిస్టర్‌ క్లీన్‌గా నిరూపించుకోవాలనే!

కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు కుప్పం నియోజకవర్గంలో సహజవనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. టీడీపీలోని మండల స్థాయి నాయకులే అక్రమ క్వారీలు, కృత్రిమ ఇసుక దందా, తమిళనాడు నుంచి కర్ణాటకకు బియ్యం స్మగ్లింగ్‌ నిరాటంకంగా సాగాయి. ఇవన్నీ కూడా కంచర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తొలి నుంచీ విమర్శలు గుప్పుమన్నాయి. సొంత పార్టీ వారే బహిరంగంగా విమర్శించినా చంద్రబాబు చూడనట్టు వదిలేశారు. దీంతో ప్రభుత్వ భూముల కబ్జాలు, దౌర్జన్యాలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. కుప్పం గంజాయి రవాణాకు కేంద్రంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకోక పోయినా ఒడిశా, తమిళనాడు పోలీసులు కూటమి నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారాలను నిఘా వర్గాలు, సీనియర్లు ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు. సొంత పార్టీలో అంతర్గత విబేధాలు, ఆధిపత్య పోరు నేరుగా బహిరంగ వేదికలపైనే వ్యక్తమైనా చూడనట్టు వదిలేశారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కంచర్లపై వేటు వేశారు. కుప్పం ప్రాంతంలో జరిగిన, జరుతున్న తప్పులు తనకు ఇప్పటి వరకూ తెలియవని చెప్పుకోవడం ద్వారా తాను మిస్టర్‌ క్లీన్‌ అని చాటుకునే ఎత్తులో భాగంగా బాబు కొత్త డ్రామాకు తెరదీసినట్టు ప్రచారం జరుగుతోంది.

నమ్మిన వారికి చేటే

కుప్పంలో చంద్రబాబు రాజకీయ ప్రస్తానం ప్రారంభంలో తిరుపతికి చెందిన మనోహర్‌ను తన పీఏగా కుప్పానికి తెచ్చారు. పార్టీ వ్యవహారాలతో పాటు అధికారం ఉన్న సందర్భాలతో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన ద్వారానే నడిపించారు. పూర్తిగా అంకితమై పని చేసిన మనోహర్‌ కుప్పంలో టీడీపీకి బలమైన పునాదులు వేశారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్లను కుప్పానికి తెచ్చాక మనోహర్‌ను పూర్తిగా పక్కన బెట్టేశారు. శాంతిపురం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తొలి నుంచి చంద్రబాబు నమ్మిన బంటుగా వ్యవహరించారు. సొంత పార్టీ క్యాడర్‌ నుంచే విమర్శలు వచ్చినా అనేక పదవులు కట్టబెట్టారు. చివరకు 2024లో అధికారంలోకి వచ్చాక ఆయనను పూర్తిగా సైడ్‌ పెట్టేశారు. విపక్షంలో ఉండగా కంచర్లను తీసుకొచ్చి కుప్పం పగ్గాలు ఇచ్చారు. దీంతో ఆయన చంద్రబాబు మెజారిటీ గతం కంటే కొంత వరకూ పెంచగలిగారు. కానీ చివరకు ఆయనను కూడా అవమానకర రీతిలో సాగనంపారు. ఇంత కాలం ఆయనకు సన్నిహితంగా పార్టీలో ఉన్న క్యాడర్‌ అధినేత నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నా అధికారం ఉండడంతో మౌనం పాటిస్తున్నారు. పాత శ్రీకాంత్‌ పోతే కొత్త శ్రీకాంత్‌ వస్తున్నాడే తప్ప నిజాయితీగా పార్టీకి పనిచేసే స్థానికులకు మాత్రం న్యాయం జరగదని నిట్టూర్చుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement