గృహావసరాల సిలిండర్ల ధర పెంచిన కేంద్రం
రూ.978కు చేరిన వంటగ్యాస్
మూడు నెలల్లో రెండోసారి పెంపు
సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం
ఒకవైపు పెట్రోల్, డీజిల్.. మరోవైపు వంట గ్యాస్ ధరలు. వరుస ధరల పెంపులతో ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం తాజాగా మరోసారి గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, పాల ధరలు పెరిగి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీస్తుండగా, తాజాగా వంటగ్యాస్ ధరల పెంపు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారింది. 14.2 కిలోల గృహావసరాల గ్యాస్ సిలిండర్‌పై గత మార్చి నెలలోనే రూ.60 పెరిగింది. తాజాగా రూ.29 పెరగడంతో రూ.978కు చేరింది. మూడు నెలల వ్యవధిలోనే సిలిండర్‌పై మొత్తం రూ.89 భారం పడింది.
మళ్లీ బాదుడు..
గ్యాస్ ధరల పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా నెలవారీ ఆదాయంతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి వర్గాలు, రోజువారీ కూలీలు, పేద కుటుంబా లు ఈ భారం మోయాల్సి వస్తోంది. సిలిండర్ ధర పెరగడమే కాకుండా డోర్ డెలివరీ చార్జీల రూపంలో మరో రూ.50 వరకు అదనపు ఖర్చు అవుతోంది. దీంతో ఒక సిలిండర్ ఇంటి వద్దకు చేరే సరికి వెయ్యి రూపాయలు దాటుతుంది.
వాణిజ్య సిలిండర్ల మోత
గృహావసరాల సిలిండర్లతో పాటు ఇదివరకే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, స్వీట్స్ తయారీదారులు, ఇతర ఆహార వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులను భరించలేక కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో చిన్న హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ వ్యయం భారీగా పెరగడంతో వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.
ఇంటి బడ్జెట్ తలకిందులు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావంతో కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు కూడా తోడవడంతో ప్రతి కుటుంబంపై నెలకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయిన సమయంలో వంటగ్యాస్ ధరను కూడా పెంచడం సరైన నిర్ణయం కాదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలను నియంత్రించి ప్రజలకు ఊరట కల్పించాలని కోరుతున్నారు.


