అవినీతి ఏడీని సస్పెండ్‌ చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఏడీని సస్పెండ్‌ చేయాల్సిందే

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

● కోటి రూపాయాలు స్వాహా చేసిన ఏడీ వినోద్‌ ● ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలెందుకు ఆలస్యం ● కలెక్టరేట్‌లో ధర్నా చేపట్టిన ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ● చర్చలు జరిపిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : తమకు అండగా నిలవాల్సిన నిధులను, సంక్షేమ పథకాలను నిస్సిగ్గుగా నమిలేసిన అవినీతి తిమింగలం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) వినోద్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట మండుటెండలో న్యాయం కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగ బాధితులు తమ హక్కులు, ఆకలి కేకల కోసం, చక్రాల కుర్చీలు, చేతికరల్రతో తరలివచ్చిన దివ్యాంగుల ధర్నాతో కలెక్టరేట్‌ పరిసరాలు హోరెత్తాయి. అధికారుల కాలయాపనపై, అవినీతి ఏడీపై దివ్యాంగ లోకం రౌద్రరూపం దాల్చింది.

దివ్యాంగులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

న్యాయం కోసం నెలల తరబడి తిరుగుతున్నా విచారణల పేరుతో కాలయాపన చేయడంపై దివ్యాంగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేని అధికారులు అవినీతికి పాల్పడుతుంటే, వ్యవస్థలు వాటిని కాపాడుతున్నాయన్నారు. సమాజంలో దివ్యాంగులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక సాధారణ వ్యక్తి చిన్న తప్పు చేస్తే జైల్లో పెడతారు, మరి కోటి రూపాయలు లూటీ చేసిన అధికారికి ఏసీ గదుల్లో విధులా? అంటూ ధర్నాలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సస్పెన్షన్‌ వేటు వేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఈ ధర్నాలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నాయకులు లీలాపతినాయుడు, ఏకాంబరం, చిరంజీవి, మాధవి, రమేష్‌, ప్రశాంతి, మునేష్‌, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చర్చలు

దివ్యాంగులు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ భవనం ముందు మండుటెండల్లో ధర్నా చేపట్టడంతో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రాంతానికి విచ్చేసి దివ్యాంగులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నెల 12 వ తేదీన సమగ్ర విచారణ నిర్వహించి, అదే రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement