గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్న అవస్థలు చంద్రబాబు ప్రభుత్వానికి కనబడడం లేదా అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. నారాయణస్వామి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోనే మామిడిని అత్యధికంగా పండించేది చిత్తూరు జిల్లా అని, ఈ జిల్లా సీఎం సొంత జిల్లా అయినా మామిడి రైతుల కష్టాలు చంద్రబాబుకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రోజులకు రోజులు మామిడి లోడ్ల ట్రాక్టర్లతో రోడ్లపై పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదన్నారు. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా మామిడి కాయలు కేజీ 30, 40 రూపాయల వరకు ధర పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆరు రూపాయలు కూడా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మామిడి బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలను వెంటనే పట్టించుకుని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులను పట్టించుకోకపోతే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.


