మింగేసే కుట్ర ! | - | Sakshi
Sakshi News home page

మింగేసే కుట్ర !

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

● జిల్లాలో పలు పళ్ల గుజ్జు ఫ్యాక్టరీల సిండికేట్‌ ● పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీలు తెరవకపోవడంపై అనుమానాలు ● తోతాపురికి తొలుత రూ.7 పాట.. ఇప్పుడు ర్యాంపుల్లో రూ.4కే కొనుగోళ్లు ● ధరలు ప్రకటించని ఫ్యాక్టరీలు.. బిల్లుల్లోనూ స్పష్టత లేదు ● జిల్లా యంత్రాంగం మౌనం ఎందుకని కర్షకుల ప్రశ్న

కాయకష్టం

జిల్లా మామిడి రైతుల ఆవేదన రోజురోజుకూ పెరుగుతోంది. పళ్లగుజ్జు ఫ్యాక్టరీల వ్యవహారం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకుండా పరిమితంగా కొనుగోళ్లు చేపడుతుండడం, ధరల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం, టోకెన్ల పేరుతో రైతులను రోజుల తరబడి వేచి ఉండేలా చేయడం వెనుక సిండికేట్‌ వ్యవహారం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గంగాధరనెల్లూరులో పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ వద్ద బారులుతీరిన ట్రాక్టర్లు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మామిడి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తుంటే, గుజ్జు ఫ్యాక్టరీలు మాత్రం కొనుగోళ్లపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని ధరలను కృత్రిమంగా తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో తోతా పురి మామిడికి కిలో రూ.7 వరకు ధర లభిస్తుందని ఫ్యాక్టరీల వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సీజన్‌ ముందుకు సాగేకొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. తాజాగా ఫ్యాక్టరీలు కేజీ రూ.5లకు నిర్ణయించినట్టు రైతులు రగిలిపోతున్నారు. అలాగే మొదట ర్యాంపుల్లో కిలో రూ.5 చొప్పున కొనుగోలు చేశాయి. ఆదివారం నుంచి ఆ ధరను రూ.4కు తగ్గించాయని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కోసి తీసుకొచ్చిన తర్వాత రైతులకు ప్రత్యా మ్నాయం లేకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

అనుమానాలు ఇలా...

పలు ఫ్యాక్టరీల్లో ఒకే తరహా ధరలు ఉండడం, ధరలను ఎవరూ బహిరంగంగా ప్రకటించకపోవడం, కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి అంశాలను బట్టి ఫ్యాక్టరీలు సిండికేట్‌ అయినట్టు రైతుల్లో అనుమానాలను పెంచుతున్నాయి. పంట అధిక దిగుబడిని ఆసరాగా చేసుకుని ధరలు తగ్గించే ప్రయత్నం జరుగుతోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో మామిడి సాగు వివరాలు:

జిల్లాలో మామిడిసాగు విస్తీర్ణం

59326 హెక్టార్లు

తోతాపురి రకం 40024 హెక్టార్లు

తోతాపురి దిగుబడి అంచనా 483981

మొత్తం ఫ్యాక్టరీలు 35

ప్రస్తుతం గుజ్జు తయారీ చేస్తున్న

ఫ్యాక్టరీల సంఖ్య 5

ధరల పట్టిక ఏదీ?

గుజ్జు ఫ్యాక్టరీలపై రైతుల ప్రధాన అభ్యంతరం ధరల విషయంలోనే ఉంది. ఒకవేళ ధరలు పారదర్శకంగా ఉంటే బహిరంగంగా ప్రకటించడంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఫ్యాక్టరీ ఎదుట ఆ రోజు అమల్లో ఉన్న ధరల పట్టిక ఏర్పా టు చేయాలని, కాయకు ఎంత ధర ఇస్తున్నారో వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ చాలాచోట్ల ధరలు మౌఖికంగానే చెబుతున్నారని, బిల్లుల్లో కూడా పూర్తి వివరాలు ఇవ్వ డం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన కాయలకు సంబంధించి ఇచ్చే బిల్లుల్లో కిలో ధర, మొత్తం బరువు, నాణ్యత పేరుతో విధించిన కోతలు, తుది చెల్లింపు వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

మామిడి రైతుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏడాది పొడవునా శ్రమించి పండించిన పంటను ఇప్పుడు అమ్ముకోలేని పరిస్థితి వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. గుజ్జు కర్మాగారాల వద్ద ధరలు చెప్పరు.. టోకెన్లు ఇవ్వరు.. ఫ్యాక్టరీలు పూర్తి గా పనిచేయవు. చివరకు కిలో రూ.5 నుంచి రూ.4కు కాయలు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభు త్వం వెంటనే జోక్యం చేసుకుని మామిడి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి కొనుగోళ్లలో పారదర్శకత, గిట్టుబాటు ధర, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

రూ.5లకు కొంటున్నారు

కోతలు ప్రారంభమై వారం కూడా కాలేదు. 5 శాతం కాయలు కూడా కోత కోయలేదు. తొలుత తోతాపురి కేజీ రూ.7లని నోటి మాటగా ప్రకటించారు. ఇప్పుడు రూ. 5లు అంటున్నారు. ఆ ధరను కూడా స్పష్టంగా చెప్పడం లేదు. అసలు ఫ్యాక్టరీల ఎదుట ధరల పట్టిక ఏదీ? అధికారులు, ఈ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది. ఇది ముమ్మాటికీ మోసం. ఫ్యాక్టరీలు సిండికేట్‌ అయి.. రైతులను దెబ్బతీస్తున్నాయి. పట్టించుకోకుంటే రైతుల ఉద్యమం తప్పదు.

– మునీశ్వర్‌రెడ్డి, మామిడి రైతు సంఘ నాయకులు, చిత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement