ఎన్‌టీఏ వరుస వైఫల్యాలు నీట్ పేపర్ లీక్, నెట్ గందరగోళం, సీయూఈటీ రద్దుపై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నేషనల్ టార్చర్ ఏజెన్సీగా మారిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి మండిపడ్డారు. ఆ సంఘ నాయకులు సోమవారం చిత్తూరు గాంధీ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలను నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందన్నారు. అది పరీక్షలు నిర్వహించే సంస్థ కాదు.. విద్యార్థులను వేధించే ‘నేషనల్ టార్చర్ ఏజెన్సీ’గా మారిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్నత విద్య ప్రవేశాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎన్‌టీఏ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. గత కొన్నేళ్లుగా నీట్, యూజీసీ–నెట్, సీయూఈటీ వంటి పరీక్షల నిర్వహణలో వరుసగా లోపాలు, అక్రమాలు బయటపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా విద్యార్థులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని మండిపడ్డారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల పొట్టగొట్టి, పేపర్లు అమ్ముకున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. చదువును హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఎన్‌టీఏ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని, వైఫల్యాలకు బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే దిగిపోవాలని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అక్బర్, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ చిత్తూరు జిల్లా కన్వినర్ మసూద్, జిల్లా నాయకులు దుర్గ ప్రసాద్, వివేక్, రూపేష్, సలీమ్, తేజ తదితరులు పాల్గొన్నారు.


