గౌరవ వేతనం ఇవ్వకుంటే సమావేశాలకు రాలేం | - | Sakshi
Sakshi News home page

గౌరవ వేతనం ఇవ్వకుంటే సమావేశాలకు రాలేం

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

– జెడ్పీటీసీ సభ్యుడి ఆవేదన

చిత్తూరు కార్పొరేషన్‌: ‘‘గౌరవ వేతనం ఇవ్వకపోతే సమావేశాలకు రాలేము. మమ్మల్ని దయచేసి పిలవకండి’’ అని కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవణ ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం కోరం లేకపోవడంతో 4వ కమిటీ విద్య, వైద్యం అంశాల చర్చను వాయిదావేశారు. ఆ సమావేశాన్ని సోమవారం జెడ్పీ కార్యాలయంలో వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవణ మాట్లాడుతూ తమకు పలు నెలలుగా వేతనాలు ఇవ్వలేదన్నారు. తాము ఉత్సవ విగ్రహాలుగా మారామన్నారు. మండల స్థాయిలో జరుగుతున్న పనుల గురించి వివరాలు తెలపడం లేదన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల్లో సరిపడా వైద్య సిబ్బంది లేరన్నారు. దీంతో రోగాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. ఈ సమస్యను అవకాశంగా మార్చు కుని ఆర్‌ఎంపీలు చేలరేగిపోతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన ఆర్‌ఓ ప్లాంట్లు మరమ్మతు గురయ్యాయని తెలిపారు వాటిని బాగుచేస్తే పిల్లలకు శుద్ధిచేసిన తాగునీరు దొరుకుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వడం లేదని సోమల జెడ్పీటీసీ సభ్యురాలు కుసుమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. మండలానికి రూ.10 లక్షలు అభివృద్ధి పనుల కోసం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ రవికుమార్‌నాయుడు, సీ్త్ర శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భారతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement