పాలసముద్రం : ఇప్పడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గజదొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతోందన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో వైఎస్ కుటుంబంపై బురద జల్లుతూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
ఎన్టీఆర్‌తోనే కాలగర్భంలో కలిసిన టీడీపీ
రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయనతోనే కాలగర్భంలో కలిసిపోయిందని నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైఎస్ కుటుంబంపై వ్యక్తిగత, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంటే గొడ్డలి పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైవర్షన్ రాజకీయాలు
నిజమైన గొడ్డలి పార్టీ ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయకత్వంలో నడిచే టీడీపీనేన్నారు. ఇప్పుడున్నది తెలుగు దేశం పార్టీ కాదని, తెలుగు దోపిడీ పార్టీ అని, అసలు గొడ్డలి పార్టీ ఎవరిదో చంద్రబాబూ అంతరాత్మకే తెలుసని నారాయణ స్వామి అన్నారు. 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ తన పంథాను మార్చుకోలేదన్నారు. 2024లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఆంధ్ర ప్రజ లను నిలువునా ముంచారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైనప్పుడు డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందె వేసిన చెయ్యి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను నిలువునా మోసం చేసి ఆయన మరణానికి కారణం నువ్వు కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తనకే వెన్నుపోటు క్రూరుడు చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ చెప్పిన మాట సత్యం కదా అని నిలదీశారు. 1995 నుంచి ఇప్పటి వరకు చంద్రాబాబు పొత్తు లేకుండా ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే వ్యక్తి ఒక్క ఎన్నికల్లోనైనా మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదన్నారు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోసం ర్యాలీ చేసిన రైతులపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపి, వారి మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్నా తన ప్రశ్నలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు.


