త్వరలో పూర్తిస్థాయిలో దక్షిణకోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు సికింద్రాబాద్ వీడి.. విశాఖ ‘‘డెక్’ భవనం గూటికి కడప రైల్వే
సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్
రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. 1966 అక్టోబరు 2న ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్‌గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిపాలన అధికారికంగా త్వరలో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్‌తో ఉన్న జోన్ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్‌తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్ రైల్వే జోన్ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కొత్త జోన్ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్’ భవనంలో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేశారు.
కొత్త జోన్‌లోనూ అన్యాయమేనా..?
విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్‌పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు.
ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు
కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని అత్యంత కీలకమైన ‘కెకె లైన్’ (కోరాపుట్–కిరండూల్ లైన్) తిరిగి ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో నే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్‌కు రూ.25 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఈ మార్పులతో రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరో వైపు, జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్‌ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్ రైల్వే జోన్‌లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్ డివిజన్, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్‌లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి.


