సాక్షి టాస్క్ పోర్స్ : పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో రహదారి నిర్మాణ పనులు వివాదానికి దారితీశాయి. హైకోర్టులో కేసు కొనసాగుతున్న భూమిలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బెంగళూరు–చిత్తూరు హైవేకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డును సమీప గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. గతంలో పేదల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు అదే ప్రాంతంలో రోడ్డు పనులు చేపడుతుండడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ పనులు చేస్తుండడంపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కూటమి నాయకులు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ప్రశ్నించే వారిని అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
విచారణకు డిమాండ్
అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు కేటాయించిన స్థలాలు, ప్రభుత్వ భూముల విషయంలో భవిష్యత్తులో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


